సుప్రీంకోర్టులో సోమవారం సంచలన ఘటన చోటుచేసుకుంది! భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై ఓ న్యాయవాది దాడికి యత్నించినట్టు సమాచారం.
పలు నివేదికల ప్రకారం.. కోర్టు విచారణ సందర్భంలో సదరు న్యాయవాది డయాస్ వైపు దూసుకెళ్లారు. అనంతరం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి చేసే ఉద్దేశంతో తన షూని తీశారు.
అదే సమయంలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ న్యాయవాదిని అడ్డుకుని, అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లిపోయారు.
“సనాతన ధర్మానికి అగౌరవం జరగకుండా చూసుకుంటా,” అని ఆ న్యాయవాది అరుస్తూ, బయటకు వెళ్లారు.
ఇంత జరిగినప్పటికీ సీజేఐ జస్టిస్ గవాయ్ తన ఏకాగ్రతను కోల్పోలేదు.
“ఇలాంటి వాటిని పట్టించుకోకండి. మనం మన దృష్టిని మరల్చకూడదు. ఇలాంటివి నన్ను ప్రభావితం చేయవు,” అని సీజేఐ చాలా ప్రశాంతంగా స్పందించారు.
అనంతరం కోర్టు కార్యకలాపాలను కొనసాగించారు.
కాగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై సదరు న్యాయవాది ఎందుకు దాడికి యత్నించారు? అన్న విషయంపై స్పష్టత లేదు. కానీ గతంలో ధ్వంసానికి గురైన విష్ణుమూర్తి విగ్రహానికి చుట్టూ ఈ వ్యవహారం నెలకొందని తెలుస్తోంది.
మధ్యప్రదేశ్‌లోని ఖజురాహోలో 7 అడుగుల విష్ణుమూర్తి విగ్రహం ధ్వంసమైంది. ఈ విషయంపై దాఖలైన కేసును కొన్ని రోజుల క్రితం కొట్టి వేస్తూ.. “ఏదో ఒకటి చేయమని వెళ్లి విగ్రహాన్నే అడగండి. మీరు విష్ణు మూర్తి మహా భక్తులు అని చెప్పుకుంటున్నారు. అలా అయితే వెళ్లి ప్రార్థన చేయండి. ఆ స్థలం ఆర్కియోలాజీ కిందకు వస్తుంది. ఏఎస్ఐ అనుమతులు ఇవ్వాలి,” అని సీజేఐ అన్నారు.
సీజేఐ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. వివాదంపై స్పందిస్తూ.. “నాకు అన్ని మతాలపై గౌరవం ఉంది. ఎవరినీ అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు,” అని వివరణ ఇచ్చారు.
సీజేఐకి మద్దతుగా నిలిచిన కేంద్ర సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా.. “సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని చాలా ఎక్కువగా చూస్తుంటారు,” అన్నట్టుగా మాట్లాడారు.
“న్యూటన్ లా ప్రకారం ప్రతి చర్యకు, సమానమైన ప్రతిచర్య ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం స్పందనలు చర్యలకు మించి ఉంటున్నాయి,” అని తుషార్ మెహ్తా అభిప్రాయపడ్డారు.
సంబంధిత కథనం