Lawrence Bishnoi Brother : లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ అమెరికాలో అరెస్టు-lawrence bishnoi brother anmol arrest in california america know details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lawrence Bishnoi Brother : లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ అమెరికాలో అరెస్టు

Lawrence Bishnoi Brother : లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ అమెరికాలో అరెస్టు

Anand Sai HT Telugu
Nov 18, 2024 09:47 PM IST

Lawrence Bishnoi Brother Arrest : గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను సోమవారం అమెరికాలోని కాలిఫోర్నియాలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై అధికారులు నాన్‌బెయిలబుల్ వారెంట్‌ ఇష్యూ చేశారు.

లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ అరెస్ట్
లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ అరెస్ట్

జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను కాలిఫోర్నియాలో అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. భారతీయ ఏజెన్సీల అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాత కాలిఫోర్నియా పోలీసులతో సంప్రదించేందుకు భారత్‌లోని నిఘా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతడిని భారతదేశంలో అప్పగించే ప్రక్రియను ప్రారంభించిన కొన్ని వారాల తర్వాత అరెస్టు అయ్యాడు. ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య, నటుడు సల్మాన్ ఖాన్ నివాసంలో కాల్పులకు సంబంధించిన కేసులలో అతను దేశంలోనే వాంటెడ్‌గా ఉన్నాడు.

అంతేకాదు పలు కేసుల్లో వాంటెడ్ గా ఉన్న అతడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గత నెలలో రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది. కెనడా, అమెరికా నుండి లారెన్స్ బిష్ణోయ్ ముఠాను నడుపుతున్నట్లు భావిస్తున్నారు. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టులో అన్మోల్ కూడా ఉన్నాడు.

ముంబైలో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ హత్య కేసులో ఇతని పేరు తెరపైకి వచ్చింది. అధికారుల ప్రకారం అతను నిరంతరం షూటర్లతో టచ్‌లో ఉన్నాడు. ముంబై పోలీసులు అతనిపై లుక్ అవుట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు.

బాబా సిద్ధిఖీతో పాటు పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు అన్మోల్. గతేడాది ఆయనపై దర్యాప్తు సంస్థ చార్జిషీట్ దాఖలు చేసింది. అన్మోల్ తన లొకేషన్‌ను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాడని కూడా అధికారులు భావిస్తున్నారు. అన్మోల్ మీద దాదాపు 18 కేసులు నమోదయ్యాయి. కొంతకాలం జోధ్‌పూర్ జైలులో కూడా కస్టడీలో ఉన్నాడు. 7 అక్టోబర్ 2021న బెయిల్‌పై విడుదలయ్యాడు.

సిద్ధూ మూసేవాలా హత్య కేసు తర్వాత ఏప్రిల్ 14న ముంబైలోని సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల కేసులో అన్మోల్ పేరు కూడా వచ్చింది. సల్మాన్ బస చేసిన గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల జరిగిన కాల్పులకు స్వయంగా బాధ్యత వహించాడు.

'యూఎస్ నుండి పనిచేస్తున్న అన్మోల్ బిష్ణోయ్ నాలుగైదు రోజుల క్రితం కాలిఫోర్నియాలో నిర్బంధించారు. మా మూలాల నుండి మేం తెలుసుకున్నాం. అధికారిక మార్గాల ద్వారా మరిన్ని వివరాలను పొందడానికి ప్రయత్నిస్తున్నాం.' అని ఓ అధికారి తెలిపారు.

కాలిఫోర్నియాలో అన్మోల్ బిష్ణోయ్ ఏ పరిస్థితులలో పట్టుబడ్డాడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి భారత అధికారులు ప్రయత్నిస్తున్నారు. అన్మోల్ బిష్ణోయ్ చివరిగా కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో నగరంలో ఉన్నాడు. బిష్ణోయ్‌ ఆచూకీపై అమెరికా అధికారులు ఇప్పటికే ముంబై పోలీసులతో టచ్‌లో ఉన్నారు.

Whats_app_banner