Kedarnath Yatra Landslide : కేదార్నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియలు- ముగ్గురు మృతి..
Kedarnath landslide : కేదార్నాథ్ యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. చిద్వాసాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కేదార్నాథ్ యాత్ర మార్గంలోని చిద్వాసాలో ఆదివారం ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన (ఎస్డీఆర్ఎఫ్) బృందం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించింది.
మూడు మృతదేహాలను జిల్లా పోలీసులకు అప్పగించామని, క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. కేదార్ నాథ్ ధామ్‌ను దర్శించుకునేందుకు భక్తులు గౌరీకుండ్ నుంచి బయలుదేరిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “కేదార్నాథ్ యాత్ర మార్గం సమీపంలోని కొండపై నుంచి శిథిలాలు, భారీ రాళ్లు పడటంతో కొందరు యాత్రికులు గాయపడ్డారన్న వార్త చాలా బాధాకరం,” అని ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ధామి పేర్కొన్నారు.
ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఈ విషయంలో అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని ధామి చెప్పారు. ప్రమాదంలో గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
గౌరీకుండ్-కేదార్నాథ్ ట్రెక్కింగ్ మార్గంలోని చిద్వాసా ప్రాంతానికి సమీపంలో ఉదయం 7:30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వర్ తెలిపారు. శిథిలాలు, భారీ రాళ్లు కొండపై నుంచి పడ్డాయి అని వెల్లడించారు.
ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. వాటిని పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
చార్ధామ్ యాత్ర..
చార్ధామ్ యాత్రలో ఈ కేదార్నాథ్ ఆలయం ఒక భాగం. ఈ ఏడాది మే 10న చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా భక్తులు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ బద్రినాథ్లను సందర్శించుకుంటారు. కానీ నైరుతి రుతుపవనాల కారణంగా జూన్ చివరి వారంలో ఉత్తరాఖండ్‌లో వర్షాలు కురుస్తాయి. ఫలితంగా వరదలు, కొండచరియలు విరిగి పడే ఘటనలు వార్తల్లో నిలుస్తుంటాయి. ఫలితంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
సంబంధిత కథనం