Lalit Modi: రాహుల్ గాంధీని బ్రిటన్ కోర్టులో నిలబెడతా: లలిత్ మోదీ తీవ్ర కామెంట్లు-lalit modi decides to sue rahul gandhi in court attacked with tweets ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Lalit Modi Decides To Sue Rahul Gandhi In Court Attacked With Tweets

Lalit Modi: రాహుల్ గాంధీని బ్రిటన్ కోర్టులో నిలబెడతా: లలిత్ మోదీ తీవ్ర కామెంట్లు

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 30, 2023 02:27 PM IST

Lalit Modi: రాహుల్ గాంధీని బ్రిటన్ కోర్టుకు వచ్చేలా చేస్తానని లలిత్ మోదీ ట్వీట్ చేశారు. తనపై నిరాధారణ ఆరోపణలు పదేపదే చేస్తున్నారని, తాను ఏ తప్పు చేయలేదని అన్నారు.

Lalit Modi: రాహుల్ గాంధీని బ్రిటన్ కోర్టులో నిలబెడతా: లలిత్ మోదీ తీవ్ర కామెంట్లు (HT Photo)
Lalit Modi: రాహుల్ గాంధీని బ్రిటన్ కోర్టులో నిలబెడతా: లలిత్ మోదీ తీవ్ర కామెంట్లు (HT Photo)

Lalit Modi: కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై ఐపీఎల్ ఫౌండర్, ప్రస్తుతం బ్రిటన్‍లో ఉంటున్న లలిత్ మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు నోటీసులు పంపుతానంటూ హెచ్చరించారు. న్యాయవ్యవస్థ నుంచి తనను పరారైన వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారని, మనీ ల్యాండరింగ్ కేసులో తనపై నిరాధార ఆరోపణ చేస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు వేసి, బ్రిటన్ కోర్టులో నిలబెడతానంటూ ట్వీట్లు చేశారు. “మోదీ ఇంటిపేరు”పై చేసిన కామెంట్ల కారణంగానే దోషిగా తేలి, ఎంపీగా రాహుల్ గాంధీపై ఇటీవలే అనర్హత వేటు పడగా.. తాజాగా లలిత్ మోదీ కూడా ఎంట్రీ ఇచ్చారు. వివరాలివే.

ట్రెండింగ్ వార్తలు

2019లో కర్ణాటకలోని కొలార్‌లో ఓ సభ సందర్భంగా.. నరేంద్ర మోదీ, లలిత్ మోదీ, నీరవ్ మోదీని ఉద్దేశిస్తూ.. “దొంగలందరి ఇంటిపేరు మోదీ అని ఎలా ఉంది” అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రధాని మోదీని అవమానించారంటూ పరువు నష్టం కేసు దాఖలవగా.. గత వారం రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఎంపీగా రాహుల్ గాంధీపై లోక్‍సభ వేటు వేసింది. దీంతో ఎంపీ పదవిని ఆయన కోల్పోయారు. ఇక ఈ దుమారం నడుస్తుండగానే ఇప్పుడు లలిత్ మోదీ.. రాహుల్ గాంధీపై ట్వీట్లతో దాడి చేశారు.

దోషిగా నిరూపతమైందా!

Lalit Modi: రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష నేతలంతా తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని లలిత్ మోదీ ట్వీట్ చేశారు. “నేను న్యాయవ్యవస్థను ఎదుర్కోలేక పారిపోయానని రాహుల్ గాంధీతో పాటు ఆయన అనుచరులు పదేపదే అంటున్నారు. ఎందుకు? ఎలా? నేనేమైనా దోషిగా తేలానా? నేను సాధారణ పౌరుడిగా చెబుతున్నా, ప్రతిపక్ష నేతలంతా ఏమీ చేయలేక, చేసేందుకు పని లేక.. తప్పుడు సమాచారంతో నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్నారు” అంటూ లలిత్ మోదీ తన ట్వీట్‍లో పేర్కొన్నారు. భారత్‍లో కఠిన చట్టాలు అమలైనప్పుడు తాను తిరిగి వస్తానని పేర్కొన్నారు.

యూకే కోర్టులో కేసు వేస్తా

Lalit Modi: బ్రిటన్ (UK)లోని కోర్టులో రాహుల్ గాంధీపై తాను పరువు నష్టం కేసు వేస్తానని లలిత్ మోదీ హెచ్చరించారు. “యూకేలోని కోర్టుకు రాహుల్ గాంధీని రప్పించాలని నేను నిర్ణయించుకున్నాను. ఆయన ఇక్కడికి కచ్చితంగా రావాలి. ఆరోపణలపై ఆధారాలు చూపాలి. ఆయన ఫూల్‍ అవడాన్ని చూసేందుకు నేను వేచిచూస్తుంటా” అని లలిత్ మోదీ ట్వీట్ చేశారు.

ప్రపంచంలోనే అత్యుత్తమ ఈవెంట్‍ను సృష్టించా

Lalit Modi: గత 15 సంవత్సరాల్లో తాను ఒక్క రూపాయి కూడా అక్రమంగా సంపాదించినట్టు ఎక్కడా రుజువు కాలేదని లలిత్ మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పోర్టింగ్ ఈవెంట్‍ (ఐపీఎల్)ను తాను సృష్టించానని, దాని ద్వారా 100 బిలియన్ డాలర్ల సంపద జనరేట్ అవుతోందని పేర్కొన్నారు. 1950ల నుంచి వారికి (గాంధీ కుటుంబానికి), దేశానికి మోదీ కుటుంబం (మోదీ కమ్యూనిటీ) ఎంతో సేవ చేసిందని లలిత్ మోదీ ట్వీట్ చేశారు.

లలిత్ మోదీపై భారత్‍లో పలు ఆర్థిక నేరారోపణలు ఉన్నాయి. ఐపీఎల్ లావాదేవీల్లో అవకతవకలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం సహా విదేశాలకు అడ్డదారుల్లో డబ్బు తరలించారన్న మనీ ల్యాండరింగ్ కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. కేసుల విచారణ జరుగుతుండానే పాస్‍పోర్టు పునరుద్ధరణ జరగటంతో 2014లో ఆయన దేశం విడిచివెళ్లిపోయారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం