ఇమ్మిగ్రేషన్ అండ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ)కు వ్యతిరేకంగా అమెరికా లాస్ ఏంజిల్స్‌లో జరుగుతున్న నిరసనలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వీడియో వైరల్‌గా మారింది. పలువురు నిరసనకారులు అమెరికా జెండా మీద ఉమ్మేసి, దానిని తగలబెడుతున్న దృశ్యాలు ఈ వీడియో కనిపించాయి.
"అల్లర్లు ఇప్పుడు లాస్ ఏంజిల్స్ వీధుల్లో అమెరికా జెండాలను కాల్చి, ఉమ్మి వేస్తున్నారు, "ఎఫ్ *** ట్రంప్" అని నినదిస్తున్నారు," అనే క్యాప్షన్‌తో నిక్ సార్టర్ అనే యూజర్ తన ఎక్స్ అకౌంట్లో ఒక పోస్టును షేర్ చేశాడు. "వీళ్లు మన దేశాన్ని ద్వేషిస్తారు. వారిని ఎందుకు ఉండనివ్వాలి?!" అని ప్రశ్నించాడు.
ఈ వీడియోపై వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ సైతం స్పందించాడు. ‘క్రేజీ’ అని కామెంట్ చేశాడు.
లాస్ ఏంజిల్స్ నగరం వ్యాప్తంగా ఐసీఈ అధికారులు ఆకస్మిక, హై-ప్రొఫైల్ ఇమ్మిగ్రేషన్ రైడ్లు నిర్వహించారు. సరైన డాక్యుమెంట్లు లేని 118 మందికిపైగా మంది వలసదారులను అరెస్ట్ చేశారు. వీరిలో చాలా మందికి క్రిమినల్ చరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది.
లాస్ ఏంజిల్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఒక్క రోజులో ఏకంగా 2వేల మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ పరిణామాలతో తమను టార్గెట్ చేస్తున్నారంటే అనేక సమాజాలు, భారీ వలసదారుల జనాభా నిరసనలు చేయడం మొదలుపెట్టాయి.
జూన్ 6న తొలిసారి ప్రజలు వీధుల్లోకి ఆందోళనలు చేపట్టారు. ఆ వెంటనే అధికారులు భారీ ఎత్తున్న అరెస్టులు చేపట్టారు. అయినా నిరసనలు ఆగలేదు. రెండు రోజుల్లో పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఫెడరల్ ఏజెంట్లు, స్థానికి పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ నెలకొంది.
ఒకానొక దశలో నిరసనకారులు పాట్రోలింగ్ వాహనాలపై రాళ్లు విసిరారు. విరిగిన కుర్చీలను పడేశారు. వారి మీద అధికారులు బాష్పవాయువు గోళాలు, పెప్పర్ బాల్స్‌ని ప్రయోగించారు.
నిరసనకారులు జాతీయ జెండాను అవమానించడంపై అమెరికా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
“దీన్ని ఇప్పుడే ముగించేందుకు ఎన్ని దళాలు అవసరమైతే అన్నింటిని వాడాలి. ఇది ఆమోదయోగ్యం కానిది. వలసదారుల సమస్యపై ఇంకా సీరియస్‌గా ఉండాల్సిన సమయం వచ్చింది. డీపోర్టేషన్ని పెంచాలి,” అని ఒక యూజర్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
“జాతీయ జెండాను తగలబెట్టడం అనేది ఫెడరల్ క్రైమ్‌గా పరిగణించాలి. ఇది ఫ్రీ స్పీచ్ సమస్య కాదు. జాతీయ భద్రత సమస్య. వీళ్లందరు వెళ్లిపోతారు. నేను ఆ రోజు కోసం ఎదురుచూస్తాను. జాతీయ జెండాను తగలబెట్టిన దేశంలోనే ఉండాలనుకోవడం హాస్యాస్పదం,” అని మరొకరు అభిప్రాయపడ్డారు.
మరోవైపు నిరసనలను అణచివేసేందుకు నేషనల్ గార్డ్ దళాలను ట్రంప్ లాస్ ఏంజిల్స్లోకి పంపించారు. దీని తర్వాతే ఆందోళనలు మరింత పెరిగాయని తెలుస్తోంది! భద్రతా దళాలుతో ఆందోళనకారులు గొడవలు పడుతున్నారు. కార్లలను ధ్వంసం చేస్తున్నారు. కనపడిన వాటన్నింటికి నిప్పంటిస్తున్నారు.
నేషనల్ గార్డ్ దళాలను ట్రంప్ పంపండాన్ని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ వ్యతిరేకించారు.
“దళాలను వెనక్కి తీసుకోవాలని ట్రంప్ యంత్రాంగాన్ని అధికారికంగా కోరాను,” అని ఆయన అన్నారు.
“ట్రంప్ జోక్యం చేసుకోనంత వరకు మాకు పెద్ద సమస్యే లేదు. ట్రంప్ రావడంతో రాష్ట్ర సార్వభౌమాధికారం దెబ్బతింది. ఘర్షణలు పెరిగాయి. కాలిఫోర్నియాకు అధికారాలను తిరిగివ్వండి,” అని అన్నారు.
సంబంధిత కథనం