Kuwait fire: కువైట్ లో ఘోర అగ్నిప్రమాదం: 40 మందికి పైగా భారతీయుల సజీవ దహనం-kuwait fire 5 indians among 41 people killed in building fire in mangaf kuwait ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kuwait Fire: కువైట్ లో ఘోర అగ్నిప్రమాదం: 40 మందికి పైగా భారతీయుల సజీవ దహనం

Kuwait fire: కువైట్ లో ఘోర అగ్నిప్రమాదం: 40 మందికి పైగా భారతీయుల సజీవ దహనం

HT Telugu Desk HT Telugu
Jun 12, 2024 03:24 PM IST

Kuwait fire: గల్ఫ్ దేశం కువైట్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో 41 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్ లోని దక్షిణ మంగాఫ్ జిల్లాలో ఈ ఘోర అగ్నిప్రమాదం జరిగింది.

కువైట్ లో అగ్ని ప్రమాదం దృశ్యం
కువైట్ లో అగ్ని ప్రమాదం దృశ్యం

Kuwait fire: కువైట్ లోని దక్షిణ మంగాఫ్ జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారని కువైట్ ప్రభుత్వ వార్తా సంస్థ (కునా) తెలిపింది. బుధవారం తెల్లవారు జామున మంటలు చెలరేగడంతో భవనం పూర్తిగా దగ్ధమైంది. తెల్లవారు జామున మొదలైన మంటలు వేగంగా భవనం అంతటా వ్యాపించి లోపల ఉన్న పలువురిని చుట్టుముట్టి, క్షణాల్లో సజీవ దహనం చేశాయి. ఈ ఘటనలో 41 మంది మృతి చెందినట్లు కువైట్ ఉప ప్రధాని తెలిపారు. మృతులంతా భారతీయులేనని, వారు ప్రధానంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందినవారని తెలుస్తోంది.

కేరళకు చెందిన వారు దుర్మరణం

ఈ అగ్నిప్రమాదంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 40 మందికి పైగా కార్మికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ భవనంలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, యూపీ, బిహార్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు సహా మొత్తం 195 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఈ భవనం మలయాళీ వ్యాపారవేత్త కేజీ అబ్రహంకు చెందిన ఎన్బీటీసీ గ్రూప్ నకు చెందినది. ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కువైట్ లోని భారత రాయబారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి గురైన భారతీయులకు అవసరమైన సాయం చేయాలని ఆదేశించారు.

జైశంకర్ దిగ్భ్రాంతి

‘‘కువైట్ నగరంలో జరిగిన అగ్నిప్రమాద వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. 40 మందికి పైగా భారతీయులు మరణించగా, 50 మందికి పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మా అంబాసిడర్ క్యాంపుకు వెళ్లాడు. మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నాం' అని జైశంకర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషయంలో సంబంధిత వారందరికీ తమ రాయబార కార్యాలయం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.

కారణాలు వెతుకుతున్నాం..

మంటలు అదుపులోకి వచ్చాయని, అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆధారాల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారని కువైట్ ప్రభుత్వం తెలిపింది. అగ్నిప్రమాదం జరిగిన భవనాన్ని కార్మికుల వసతి కోసం ఉపయోగించారని, అక్కడ పెద్ద సంఖ్యలో కార్మికులు ఉన్నారని వెల్లడించింది. ‘‘ఈ ప్రమాదంలో చిక్కుకున్న చాలామందిని రక్షించారు, కానీ దురదృష్టవశాత్తు మంటల నుండి పొగ పీల్చడం వల్ల చాలా మంది మరణించారు’’ అని సీనియర్ పోలీసు కమాండర్ చెప్పారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.