మమతా బెనర్జీ రాజీనామాకు నిర్భయ తల్లి డిమాండ్.. పరిస్థితిని ఎదుర్కోవడంలో ఆమె విఫలమయ్యారని వ్యాఖ్య
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో డాక్టర్‌పై అత్యాచారం- హత్య కేసులో ప్రజల దృష్టిని మరల్చడానికి పశ్చిమ బెంగాల్ సీఎం ప్రయత్నిస్తున్నారని నిర్భయ తల్లి ఆశాదేవి ఆరోపించారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి పరిస్థితిని చక్కదిద్దడంలో విఫలమయ్యారని, మమతా బెనర్జీ రాజీనామా చేయాలని నిర్భయ తల్లి ఆశాదేవి డిమాండ్ చేశారు.
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసుపై ఆమె పీటీఐతో మాట్లాడారు.
"ఒక మహిళగా, ఆమె (మమతా బెనర్జీ) రాష్ట్ర పెద్దగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ దోషులపై చర్యలు తీసుకోవాల్సింది. పరిస్థితిని చక్కదిద్దడంలో విఫలమైనందుకు ఆమె రాజీనామా చేయాలి' అని ఆశాదేవి డిమాండ్ చేశారు. ‘పశ్చిమ బెంగాల్ సీఎం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు..’ అని నిర్భయ తల్లి ఆరోపించారు.
"దోషులపై చర్య తీసుకోవడానికి బదులుగా, మమతా బెనర్జీ ఈ సమస్య నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి నిరసన వ్యక్తం చేస్తున్నారు" అని ఆశాదేవి అన్నారు. ఆర్జి కర్ బాధితురాలికి 'న్యాయం' చేయాలని మరియు నేరస్థులను 'ఉరి తీయాలని' డిమాండ్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ఆమె పార్టీ నాయకులు శుక్రవారం చేసిన 'నిరసన మార్చ్'ను ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
2012 డిసెంబర్ 16న కదులుతున్న బస్సులో 'నిర్భయ'పై సామూహిక అత్యాచారం, చిత్రహింసలు జరిగినప్పుడు ఆ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆమెను విమానంలో సింగపూర్ కు తరలించారు. అక్కడ డిసెంబర్ 29న ఆమె ఆసుపత్రిలో మరణించింది.
రేపిస్టులను సత్వరమే శిక్షించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా లేనంతవరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని ఆశాదేవి ఆందోళన వ్యక్తంచేశారు.