Kolkata Doctor Rape Case : ఆ రోజు రాత్రి రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లిన కోల్‌కతా రేప్ కేసు నిందితుడు-kolkata rape murder case accused sanjay roy visited red light area on the night details inside ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kolkata Doctor Rape Case : ఆ రోజు రాత్రి రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లిన కోల్‌కతా రేప్ కేసు నిందితుడు

Kolkata Doctor Rape Case : ఆ రోజు రాత్రి రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లిన కోల్‌కతా రేప్ కేసు నిందితుడు

Anand Sai HT Telugu
Aug 21, 2024 06:32 AM IST

Kolkata Doctor Rape Case In Telugu : కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్‌ గురించి కొన్ని విషయాలు బయటపడుతున్నాయి. ఆ రోజు రాత్రి అతడు రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లినట్టుగా తేలింది.

నిందితుడు సంజయ్ రాయ్
నిందితుడు సంజయ్ రాయ్

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో 31 ఏళ్ల జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసును సీబీఐ సీరియస్‌గా ఇన్వెస్టిగేట్ చేస్తోంది. నిందితుడిపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. మరోవైపు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌ సందీప్ ఘోష్‌ను సైతం విచారించింది. ఈ కేసుపై సుప్రీం కోర్టు కూడా సీరియస్ అయింది. బెంగాల్ ప్రభుత్వంపై మండిపడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్‌ రాయ్‌ గురించి కీలక విషయాలు తెలుస్తున్నాయి.

నిందితుడు సంజయ్ రాయ్ ఆగస్టు 8వ తేదీ రాత్రి సోనాగచ్చి రెడ్‌లైట్ ఏరియాలో మద్యం సేవించి రెండు వ్యభిచార గృహాలకు వెళ్లాడని ఎన్డీటీవీ చెప్పింది. మరోవైపు అతడి పెళ్లిళ్ల విషయం గురించి కూడా చర్చ నడుస్తోంది. ఇప్పటికే సంజయ్ రాయ్.. అత్త అతడిపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సంజయ్‌ మంచి వాడు కాదని, అతడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచారం, హత్యపై సుప్రీం కోర్టు కూడా విచారణ జరిపింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం మరొక అత్యాచారం కేసు కోసం వేచి ఉండదని చెప్పారు. ఆసుపత్రి యాజమాన్యం, బెంగాల్ ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. ప్రస్తుత చట్టాలు వైద్యులు, వైద్య కార్మికులకు సంబంధించిన సంస్థాగత భద్రతా ప్రమాణాలను ప్రస్తావించడం లేదని కూడా అన్నారు. నిరసన తెలిపిన వైద్యుల ఆందోళనలను అత్యంత ప్రాముఖ్యతతో స్వీకరిస్తున్నామని, పనిని తిరిగి ప్రారంభించాలని వైద్యులను సుప్రీం కోర్టు కోరింది.

ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌తో సహా అనుమానితులను సీబీఐ విచారణ చేసింది. సుప్రీంకోర్టు ఈ కేసును తన పరిధిలోకి తీసుకుంది. ఆగస్టు 22 నాటికి స్టేటస్ రిపోర్ట్‌ను దాఖలు చేయాలని ఆదేశించింది.

ఇంకోవైపు ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్, నిందితుడు సంజయ్ రాయ్, కోల్‌కతా పోలీస్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ అనూప్ దత్తా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీంతో సీబీఐ అధికారులు వారిని ప్రశ్నించారు. హత్య జరిగిన రెండ్రోజుల తర్వాత సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. ఘటన తర్వాత సెమినార్ హాల్ సమీపంలోని గదులను పునరుద్ధరించాలని ఎవరు ఆదేశించారని అధికారులు ప్రశ్నించారు. ఈ నేరం వెనుక కుట్ర దాగి ఉందో లేదో తేల్చేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. ఆ రోజు విధుల్లో ఉన్న వైద్యులు, ఇంటర్న్‌లతో సందీప్ ఘోష్ సమాధానాలను సీబీఐ పోల్చి చూస్తోంది.