కోల్‌కతా రేప్ కేసు.. వైద్యురాలి శరీరంపై సంజయ్ రాయ్ లాలాజలం.. ఛార్జ్‌షీట్‌లో 11 ఆధారాలు-kolkata rape case charge sheet cbi cites blood stain dna report of accused sanjay roy among 11 evidence ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  కోల్‌కతా రేప్ కేసు.. వైద్యురాలి శరీరంపై సంజయ్ రాయ్ లాలాజలం.. ఛార్జ్‌షీట్‌లో 11 ఆధారాలు

కోల్‌కతా రేప్ కేసు.. వైద్యురాలి శరీరంపై సంజయ్ రాయ్ లాలాజలం.. ఛార్జ్‌షీట్‌లో 11 ఆధారాలు

Anand Sai HT Telugu
Oct 10, 2024 11:22 AM IST

Kolkata Rape Case : కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో అరెస్టయిన కోల్‌కతా పోలీసు పౌర వాలంటీర్ సంజయ్ రాయ్‌కి వ్యతిరేకంగా సీబీఐ పలు ఆధారాలను జాబితా చేసింది. అతడే ఏకైక నిందితుడిగా పేర్కొంది.

కోల్ కతా రేప్ నిందితుడు సంజయ్ రాయ్
కోల్ కతా రేప్ నిందితుడు సంజయ్ రాయ్

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఆర్‌జి కర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఏకైక నిందితుడుగా అతడిని నిర్బంధించేందుకు సీబీఐ చార్జ్ షీట్‌లో డీఎన్‌ఏ, రక్త నమూనాల నివేదికలు వంటి 11 ఆధారాలను జాబితా చేసింది.

yearly horoscope entry point

బాధితురాలి శరీరంపై సంజయ్ రాయ్ డీఎన్‌ఏ ఉండటం, వెంట్రుకలు, శరీరంపై గాయాలు, రక్తపు మరకలు, సీసీటీవీ ఫుటేజీ, అతని మొబైల్ ఫోన్ ఉన్న లొకేషన్ కాల్ వివరాల రికార్డుల ప్రకారం.. రాయ్‌కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని సీబీఐ పేర్కొంది.

'ఆగస్టు 9 అర్ధరాత్రి సమయంలో ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో సంజయ్ రాయ్‌కి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ఉంది. అతని మొబైల్ ఫోన్ లొకేషన్ ద్వారా ఎక్కడ ఉన్నాడో రుజువైంది.' అని సీబీఐ ఛార్జ్ షీట్ పేర్కొంది. సోమవారం స్థానిక కోర్టులో సమర్పించిన చార్జిషీట్‌లో మరణించిన మహిళను ‘వి’గా చెప్పింది.

శవపరీక్ష సమయంలో వి మృత దేహం నుండి కనుగొన్న డీఎన్‌ఏ సంజయ్‌ రాయ్‌దిగా సీబీఐ తెలిపింది. అతని జీన్స్, పాదరక్షలపై వి రక్తపు మరకలు ఉన్నాయని పేర్కొంది. అక్కడ దొరికిన చిన్న వెంట్రుకలు కూడా నిందితుడు సంజయ్ రాయ్‌తో సరిపోలాయని అని ఛార్జ్ షీట్ వెల్లడించింది. మరణానికి కారణం ఉక్కిరిబిక్కిరి చేయడం వల్ల సంభవించిందని తెలిపింది.

బాధితురాలు బలవంతంగా లైంగిక వేధింపులకు గురైందని ఆమె ప్రైవేట్ భాగంలోని గాయాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. ఛార్జ్ షీట్ ప్రకారం బాధితుడి శరీరంపై రాయ్ లాలాజలం కూడా ఉంది. సంజయ్ రాయ్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.

పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి అభిజిత్ మోండల్, RG కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి, సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి చేసిన ఆరోపణలు కూడా బయటపడ్డాయి. ఇద్దరినీ అరెస్టు చేసినట్లు ఛార్జ్ షీట్లో సీబీఐ పేర్కొంది. ప్రస్తుతం ఇద్దరు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తదుపరి విచారణ పూర్తయిన తర్వాత అనుబంధ తుది నివేదికను దాఖలు చేస్తామని సీబీఐ పేర్కొంది. తమ విచారణ సందర్భంగా వైద్యురాలి తల్లిదండ్రులతోపాటు 128 మందితో సీబీఐ మాట్లాడిందని చార్జ్ షీట్‌ చెబుతోంది.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.