Kolkata doctor rape-murder: కోల్ కతా డాక్టర్ రేప్, మర్డర్ అనంతరం ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది? టైమ్ లైన్..
కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ పై జరిగిన దారుణ అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. ఈ అమానుష ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో, ఆ దారుణం జరిగిన రోజు ఏం జరిగిందో తెలియజేసే టైమ్ లైన్ ఇది.
కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ పై ఆగస్ట్ 8 అర్థరాత్రి దాటిన తరువాత హత్యాచారం జరిగింది. ఈ దారుణ ఘటనలో నిందితుడిగా అదే హాస్పటల్ లో సివిల్ వాలంటీర్ గా పని చేస్తున్న సంజయ్ రాయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి భోజనం తరువాత విశ్రాంతి తీసుకుంటున్న ఆ వైద్యురాలిపై సెమినార్ హాళ్లో ఈ దారుణం జరిగింది. ఆమె మృతదేహాన్ని మర్నాడు, అంటే, ఆగస్ట్ 9వ తేదీ ఉదయం సహ వైద్యుడు మొదటిసారి చూశాడు. పూర్తి టైమ్ లైన్ ఇక్కడ..
ఆగస్ట్ 9 ఉదయం నుంచి..
- హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ మృతదేహాన్ని ఛాతీ విభాగానికి చెందిన మొదటి సంవత్సరం పీజీటీ వైద్యుడు ఆగస్టు 9న ఉదయం 9.30 గంటలకు చూశారు.
- ఈ ఘటనకు సంబంధించి మొదటి జనరల్ డైరీ (జిడిఇ 542) ను తాలా పోలీస్ స్టేషన్ లో ఉదయం 10.10 గంటలకు నమోదు చేశారు.
- ఉదయం 10.10, 10.30 గంటలకు పోలీసులు ఆర్జీ కర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అత్యాచారం, హత్య జరిగిన సెమినార్ గదిని సీల్ చేశారు.
- సీనియర్ అధికారులు, ఫోరెన్సిక్ బృందంతో పాటు ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ ఉదయం 11 నుంచి 11.30 గంటల మధ్య ఘటనా స్థలానికి చేరుకున్నారు.
- ఉదయం 10.52 గంటలకు పోలీసు అధికారి బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
- మధ్యాహ్నం 12.30 గంటలకు కోల్ కతా పోలీసు కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
- బాధితురాలు మరణించినట్లు వైద్యులు మధ్యాహ్నం 12.44 గంటలకు ప్రకటించారు.
- పోస్ట్ మార్టం అనంతరం మధ్యాహ్నం 1.47 గంటలకు మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు.
- మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో ఆర్జీ కర్ ఆసుపత్రి ఎంఎస్వీపీ (మెడికల్ సూపరింటెండెంట్ కమ్ వైస్ ప్రిన్సిపాల్) ఒక రహస్య లేఖను తాలా స్టేషన్ ఇన్ చార్జి ఆఫీసర్ (ఓసీ)కి ఇచ్చారు.
- ఆసుపత్రిలో అనుమానాస్పద స్థితిలో మృతదేహం కనిపించినట్లుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆ లేఖలో ఉంది.
- ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అర్ధనగ్న స్థితిలో అపస్మారక స్థితిలో ఉన్న మహిళను గుర్తించినట్లు ఓ పోలీసు అధికారి మేజిస్ట్రేట్ కు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.
- ప్రైవేట్ పార్ట్స్ కు గాయాలయ్యాయని రిపోర్టులో పేర్కొన్నారు.
- పోర్టు మార్టం జరుగుతుండగానే పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను పరిశీలించడం ప్రారంభించారు. ఆ రోజు రాత్రి డ్యూటీలో ఉన్న నలుగురు డాక్టర్లతో సహా 11 మందిని విచారించారు.
- రాత్రి 8.30 నుంచి 10.45 గంటల మధ్య వీడియోగ్రఫీ కింద 40 ఎగ్జిబిట్లను సేకరించారు.
- రాత్రి 11.45 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదైంది.
సుప్రీంకోర్టు ఆగ్రహం
కేసు నమోదు చేయడంలో కోల్ కతా పోలీసులు తీవ్ర జాప్యం చేశారని సుప్రీంకోర్టు గురువారం విమర్శించింది. హత్యాచారం ఘటన వెలుగు చూసిన తరువాత ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ తో ఎవరెవరు టచ్ లో ఉన్నారు? ఎఫ్ఐఆర్ నమోదులో ఎందుకు జాప్యం చేశారు? ఉద్దేశం ఏమిటి?' అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆగస్టు 9న సాయంత్రం 6.10 గంటలకు పోస్టుమార్టం నిర్వహించి, 9వ తేదీ రాత్రి 11.30 గంటలకు ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేశారని ప్రశ్నించారు.