Kolkata doctor rape-murder: ‘‘ఒక్క రాత్రిలో నా బిడ్డ కలలన్నీ ఛిన్నాభిన్నం’’ - కోల్ కతా డాక్టర్ తండ్రి ఆవేదన
కోల్ కతా డాక్టర్ హత్యాచారంపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పలు నగరాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తన కూతురి కలలు, ఆశయాల గురించి బాధితురాలి తండ్రి వెల్లడించారు.
కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ లో విశ్రాంతి సమయంలో హత్యాచారానికి గురైన 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ తండ్రి తన కుమార్తెకు వైద్యంపై ఉన్న ప్రేమను గుర్తు చేసుకున్నారు. తన ఒక్కగానొక్క కూతురి ఆశయాలను, కలలను ఒక ఇంటర్వ్యూలో వివరించారు.
మృతదేహం పంపించారు
తమది నిరుపేద కుటుంబం అని, తన కుమార్తెను ఎన్నో కష్టాలతో పెంచామని ఆ తండ్రి 'ది గార్డియన్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘డాక్టర్ కావడానికి నా కూతురు చాలా కష్టపడింది. చదువు, చదువు, చదువు.. ఇదొక్కటే నా బిడ్డ పని. కానీ, ఒక్క రాత్రిలో మా కలలన్నీ చెదిరిపోయాయి. మేము ఆమెను పనికి పంపాము. ఆసుపత్రి ఆమె మృతదేహాన్ని మాకు తిరిగి పంపింది’’ అని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక తిరిగిరాదు..
‘‘నా కుమార్తె ఇక తిరిగి రాదు. నేనెప్పుడూ ఆమె గొంతును, ఆమె నవ్వును వినలేను. మా జీవితంలో నుంచి సంతోషం మాయమైంది. ఇప్పుడు నేను చేయగలిగిందల్లా ఆమెకు న్యాయం చేయడంపై దృష్టి పెట్టడమే' అని ఆ తండ్రి పేర్కొన్నారు. కోల్ కతాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లోని సెమినార్ హాల్ లో 10 రోజుల క్రితం పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ మృతదేహం లభ్యమైంది. మరుసటి రోజు ఈ నేరానికి సంబంధించి సంజయ్ రాయ్ అనే సివిల్ వాలంటీర్ ను అరెస్టు చేశారు. అనంతరం కలకత్తా హైకోర్టు ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించింది. ఈ ఘటనపై భారతదేశం అంతటా వైద్యులు నిరసనలకు, సమ్మెలకు దిగారు.
టైలర్ గా పని చేస్తూ..
వైద్య వృత్తి తన ఒక్కగానొక్క బిడ్డ జీవితకాల స్వప్నం అని బాధితురాలి తండ్రి తెలిపారు. తన కూతురు కలను నిజం చేయడం కోసం తాను టైలర్ పని చేస్తూ సంపాదించే కొద్ది మొత్తాన్ని ఉపయోగించేవారమని, ఆమె చదువు కోసం తామంతా ఎన్నో త్యాగాలు చేశామని వివరించారు. ‘‘నాన్నా, డాక్టర్ అయి ఇతరులకు సాయం చేయడం మంచి విషయం కదా నాన్నా. నువ్వు ఏమంటావు?’ అని నా కూతురు అడిగింది. ‘సరేనమ్మా.. నీవు కోరుకున్నది నీవు చేయి’ అని నేను చెప్పాను. ఇప్పుడు చూడండి ఏమైందో.?’’ అని ఆ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతి సంవత్సరం పది లక్షల మందికి పైగా ఔత్సాహిక వైద్యులు పోటీపడే భారత వైద్య కళాశాలల్లోని సుమారు 1,07,000 పీజీ సీట్లలో ఒకదాన్ని 31 ఏళ్ల వయసులో ఆమె సాధించారు.