Kolkata Doctor Rape Case : ఒక వ్యక్తి మాత్రమే ఈ పని చేసి ఉండడు.. కోల్‌కతా బాధితురాలి తండ్రి కామెంట్స్
Kolkata Doctor Rape Murder Case : కోల్‌కతా వైద్యురాలి హత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. అయితే తాజాగా ఘటనపై బాధితురాలి తండ్రి కామెంట్స్ చేశాడు.
కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో వైద్యురాలి అత్యాచారం, హత్యపై దేశం మెుత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో బాధితురాలి తండ్రి హత్యాచారంపై కామెంట్స్ చేశారు. ఒకరి కంటే ఎక్కువ మంది ఈ ఘోరమైన నేరంలో పాల్గొన్నారని ఆరోపించారు. డాక్టర్లతో సహా తాను మాట్లాడిన వారందరూ తమ అభిప్రాయంతో ఏకీభవించారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
'మేము మాట్లాడిన వారందరూ MBBS వైద్యులు. ఒక వ్యక్తి ఇంత ఘోరంగా చేయడం సాధ్యం కాదు. నా కుమార్తె కార్యాలయంలో సురక్షితంగా ఉంటుందని భావించేవాడిని. ఆమె క్షేమంగా ఆసుపత్రికి చేరుకునేందుకు వీలుగా ఆమెకు కారును సమకూర్చాం. మమతా బెనర్జీపై ఒకప్పుడు పూర్తి నమ్మకం ఉండేది. అయితే ఇప్పుడు దానిని కోల్పోయాం. బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు ఆమె ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.' అని బాధితురాలి తండ్రి ఆవేదనతో చెప్పారు.
మరోవైపు వైద్యురాలి తండ్రి కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. మహిళలు, బాలికల కోసం మమతా బెనర్జీ అమలు చేస్తున్న పథకాలు నకిలీవని బాధితురాలి తల్లి అన్నారు. దయచేసి మీ లక్ష్మి ఇంట్లో సురక్షితంగా ఉందో లేదో చూడండని ఆమె పేర్కొన్నారు.
కోల్‌కతా వైద్యురాలు ఆగస్టు 9న ఆర్‌జీ కర్ ఆసుపత్రిలోని సెమినార్ హాల్‌లో హత్యకు గురైంది. ఆమె 36 గంటలపాటు సుదీర్ఘ పని తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి సెమినార్ గదికి వెళ్లింది. ఆ సమయంలో ఆమెపై అత్యాచారం, హత్య జరిగింది. ఆమెను అత్యాచారం చేసి దారుణంగా హింసించారు.
ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వాలంటీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడు మృతదేహం ఉన్న భవనంలోకి ప్రవేశించడం కనిపించింది. మృతదేహానికి సమీపంలో అతడికి సంబంధించిన బ్లూటూత్ హెడ్‌ఫోన్‌ను కూడా పోలీసులు కనుగొన్నారు. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది.
తాజాగా వైద్యురాలి పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. బాధితురాలి శరీరమంతా గాయాలు ఉన్నాయి. బాధితురాలిపై లైంగిక దాడి జరిగింది. ముఖం, మెడ, తల, భుజాలు, మర్మాంగాలపై 14 గాయాలు ఉన్నాయి. గొంతు నులిమి, ఊపిరి ఆడనివ్వకుండా చేసి చంపేశారు. హత్య జరిగిన తీరు అత్యంత దారుణంగా ఉంది. ఊపిరితిత్తులో రక్తస్రావం జరిగింది. శరీరంలోని అనేక చోట్ల రక్తం గడ్డకట్టుకుపోయింది.