Kolkata doctor rape case : హత్యకు ముందు కోల్‌కతా వైద్యురాలిని వెంబడించిన నిందితుడు!
Kolkata doctor rape case : కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ నేరానికి ముందు ఆర్జీ కర్ ఆసుపత్రికి వెళ్లాడు. నేరం జరగడానికి కొన్ని గంటల ముందు బాధిత వైద్యురాలిని అతను గమనించినట్లు సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తుంది.
కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య కేసులో రోజురోజుకు కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా నిందితుడు సంజయ్ రాయ్‌కి సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. బాధితురాలిపై అత్యాచారానికి ముందే, నిందితుడు ఆమెను వెంబడించినట్టు తెలుస్తోంది.
కోల్‌కతా వైద్యురాలి హత్య కేసు వివరాలు..
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ నేరానికి ముందు బాధితురాలి సమీపంలో ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలింది. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు.
సిఎన్ఎన్-న్యూస్ 18 నివేదించిన వర్గాల ప్రకారం, నిందితుడు సంజయ్ రాయ్ అనే 33 ఏళ్ల సివిల్ వాలంటీర్.. నేరానికి కొన్ని గంటల ముందు బాధితురాలిని గమనిస్తున్నాడని సీసీటివి ఫుటేజీ చూపిస్తుంది. సీసీటీవీ ఫుటేజీలో సంజయ్ రాయ్ కూడా కనిపించాడు.
కోల్‌కతా వైద్యురాలి హత్యకు ముందు రోజు ఆగస్టు 8న ఛాతీ మెడిసిన్ వార్డులో 31ఏళ్ల బాధితురాలిని తాను చూశానని సంజయ్ రాయ్ విచారణలో అంగీకరించాడు. సీసీటివీ ఫుటేజీలు ఈ వాదనను బలపరుస్తున్నాయి.
మరోవైపు కోల్‌కతా వైద్యురాలి హత్య కేసు నిందితుడిపై సైకోఅనలిటిక్ ప్రొఫైలింగ్ జరిగింది. సంజయ్ రాయ్ "వికృత చేష్టలు చేసేవాడు (పర్వట్), పోర్నోగ్రఫీకి బానిస" అని తేలింది. ఈ వివరాలను సీబీఐ అధికారి తెలిపారు. సంజయ్ రాయ్‌కి 'జంతువు లాంటి స్వభావం' ఉందని, ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన దారుణ హత్యపై విచారణలో అతను ఎలాంటి పశ్చాత్తాపం చూపలేదని ఆ అధికారి తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు..
కోల్‌కతా వైద్యురలి హత్య కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు వైద్య నిపుణుల భద్రతకు మార్గదర్శకాలను సిఫారసు చేయడానికి జాతీయ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
సుప్రీంకోర్టు విజ్ఞప్తి మేరకు దిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో వైద్య నిపుణులు 11 రోజుల సమ్మెను విరమించి గురువారం నాటికి తిరిగి విధుల్లో చేరారు.
దేశం, ప్రజాసేవ ప్రయోజనాల దృష్ట్యా దిల్లీలోని ఎయిమ్స్ 11 రోజుల సమ్మెను విరమించాలని నిర్ణయించినట్లు రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్డీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. సుప్రీంకోర్టు విజ్ఞప్తి, ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఘటనను, దేశవ్యాప్తంగా హెల్త్ కేర్ వర్కర్ల భద్రత సమస్యను గుర్తించినందుకు సుప్రీంకోర్టుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
అంతకుముందు, కోల్‌కతా డాక్టర్ అత్యాచారం, హత్య కేసును విచారించిన సుప్రీంకోర్టు ఆరోగ్య నిపుణులను విధులకు తిరిగి రావాలని విజ్ఞప్తి చేసింది. వారు తిరిగి విధుల్లో చేరిన తర్వాత వారిపై ఎటువంటి ప్రతికూల చర్యలు తీసుకోరని హామీ ఇచ్చింది.
కోల్ కతా డాక్టర్ అత్యాచారం-హత్య కేసు
ఆగస్టు 9న కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్య జరిగిన నేపథ్యంలో వైద్య సమాజం పెద్ద ఎత్తున నిరసనలు, సమ్మెలు చేపట్టింది.
దర్యాప్తుపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఆగస్టు 15న ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన మూక దాడిపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సంబంధిత కథనం