Kolkata doctor rape case : కోల్‌కతా వీధుల్లో మళ్లీ ఉద్రిక్తత- ‘నబన్నా మార్చ్’ పై దీదీ నిఘా!
Nabanna Abhiyan live updates : కోల్‌కతా వైద్యురాలి హత్య కేసు నేపథ్యంలో మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ పలు విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టాయి. నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.
ఆర్జీ మెడికల్ కాలేజ్‌లో కోల్‌కతా వైద్యురాలి హత్యపై నిరసనగా పలు విద్యార్థి సంఘాలు చేపట్టిన 'నబన్నా అభియాన్'లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోల్‌కతాలోని సెక్రటేరియట్ (నబన్నా)కు మార్చ్ చేపట్టిన నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. రోడ్డు మీద ఉన్న వారిని చెల్లాచెదురు చేసేందుకు జల ఫిరంగులు ఉపయోగించారు.
నబన్నా మార్చ్‌కి అనుమతులు ఇవ్వబోమని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికే తేల్చిచెప్పింది. ర్యాలీలో హింసకు పాల్పడేందుకు పలువురు కుట్ర పన్నుతున్నట్టు ఆరోపించింది. అయినప్పటికీ నిరసనకారులు ముందుకు కదిలితే, వారిని ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేసింది. నిరసనకారులు సెక్రటేరియట్‌కు చేరుకోకుండా చూసేందుకు 6వేలకుపైగా మంది పోలీసులను మోహరించింది. ర్యాలీపై డ్రోన్ నిఘా పెట్టింది. అంతేకాకుండా నిరసనకారులను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసింది.
కానీ మంగళవారం మధ్యాహ్నం నిరసనకారులు నబన్నా మార్చ్‌ని ప్రారంభించారు. కోల్‌కతా వైద్యురాలి హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, నిరసనకారులు బ్యారికేడ్లను తోసుకుని ముందుకు కదిలారు. వారిపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. వారిని తరిమికొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
మరోవైపు జలఫిరంగులు ఉపయోగించినప్పటికీ, పలువురు నిరసనకారులు వెనుదిరగడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కోల్‌కతా వైద్యురాలి హత్యకు న్యాయం జరగాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలుపుతున్నారు.
కోల్‌కతా పోలీసు పరిధిలో కనీసం 25 మంది డీసీపీ స్థాయి అధికారులు భద్రతను నిర్వహించడం, నలుగురు ఐజీలు, పలువురు డీఐజీలు, ఎస్పీ స్థాయి అధికారులు హౌరాలో భద్రతా దళాలకు నాయకత్వం వహించడంతో నేటి ర్యాలీని మమతా బెనర్జీ ప్రభుత్వం ఎంత తీవ్రంగా పరిగణించిందో అర్థం చేసుకోవచ్చు. 'నబన్నా అభిజన్' ర్యాలీ సచివాలయం వద్దకు రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థి సంస్థ 'పశ్చిమ్ బంగా ఛత్ర సమాజ్', అసమ్మతి గ్రూపు 'సంగ్రామి జౌతా మంచా' ప్లాన్ చేసిన ర్యాలీని మమతా బెనర్జీ ప్రభుత్వం ఇప్పటికే "చట్టవిరుద్ధం, అనధికారికమైనది" అని ప్రకటించింది.
కోల్‌కతా, హౌరా వైపుల నుంచి ఉదయం నుంచి ట్రాఫిక్‌ను పోలీసులు తీవ్రంగా నిషేధించారు.
కోల్‌కతాలో తాజా పరిస్థితులపై గవర్నర్ బోస్ స్పందించారు.
“నిరసనలు చేస్తున్న వారిపై పలు వ్యవస్థలు ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నిస్తున్నాయి. నిరసనకారులపై తమ అధికారాన్ని చూపించవద్దని సుప్రీంకోర్టు చెప్పిన మాటలను పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి,” అని పశ్చిమ్ బెంగాల్ గవర్నర్ బోస్ అన్నారు.
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆండ్ హాస్పిటల్లో ఆగస్ట్ 9న 31ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగింది. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిరసనలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై మమతా బెనర్జీ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని ఆరోపణలు ఉన్నాయి.
సంబంధిత కథనం