భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బలూచిస్థాన్ స్వతంత్రం కావాలన్న డిమాండ్ తీవ్రమైంది. తాజాగా బలూచిస్థాన్ స్వతంత్ర దేశంగా కూడా ప్రకటించుకుంది. దానికి తగ్గట్టుగా అడుగులు వేసే పనిలో ఉంది.
అయితే అస్సాం ముఖ్యమంత్రి హిమంత శర్మ అక్కడ ఉన్న ఒక హిందూ దేవాలయాన్ని ప్రస్తావిస్తూ ఇది సనాతన ధర్మానికి చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా అభివర్ణించారు. బలూచిస్థాన్ హిందువులకు చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా ముఖ్యమైనదన్నారు. ఇక్కడ ఉన్న హింగ్లాజ్ మాత ఆలయం 51 పవిత్ర శక్తిపీఠాలలో ఒకటి అని పేర్కొన్నారు. ఉపఖండం విభజనకు ముందు ఈ ప్రాంతంలో హిందువుల పురాతన సాంస్కృతిక ఉనికికి బలూచిస్థాన్ సాక్ష్యంగా ఉందని అస్సాం సీఎం అన్నారు.
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్స్ ప్రావిన్స్‌లో అతిపెద్ద హిందూ పండుగ అయిన హింగ్లాజ్ జాతరను ఇక్కడ జరుపుకొంటారు. హింగ్లాజ్ మాత పురాతన గుహ ఆలయం ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించే కొన్ని హిందూ ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ ఆలయాన్ని చేరుకోవడానికి భక్తులు వందల మెట్లు ఎక్కుతారు.. రాళ్ల గుండా ట్రెక్కింగ్ చేస్తారు. కొబ్బరికాయ, గులాబీ రేకులు వేసి హింగ్లాజ్ మాత దర్శనానికి దైవ అనుమతి కోరతారు. ఇక్కడ మూడు రోజుల పాటు జాతర జరుగుతుంది.
భక్తులు ఇక్కడకు ఎందుకు వస్తారో ఆలయ సీనియర్ పూజారి మహారాజ్ గోపాల్ వివరించారు. 'ఇది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ మూడు రోజులూ ఎవరైతే ఆలయానికి వచ్చి పూజలు చేస్తారో వారి పాపాలన్నీ తొలగిపోతాయి.' అని చెప్పారు.
బలూచిస్థాన్ మారుమూల కొండల్లో హింగ్లాజ్ ఆలయం ఉంది. ఇది హింగోల్ నేషనల్ పార్క్ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రదేశం శక్తి దేవికి అత్యంత పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇక్కడకు వచ్చేందుకు వివిధ మార్గాలు ఉన్నాయి.
సింధీ, భావ్సర్, చరణ్ వర్గాలకు చెందిన భక్తులు శతాబ్దాలుగా ఎడారి మార్గాలను దాటి ఆలయాన్ని సందర్శిస్తూ కష్టతరమైన ప్రయాణాలు చేస్తున్నారు. ముస్లింలు కూడా ఈ స్థలాన్ని నానీ మందిర్ అని ఎంతో గౌరవంతో చూస్తారు. ఈ ఆలయం గురించి అనేక జానపద కథలు కూడా ఉన్నాయి.