MahaKumbh Mela 2025 : మహా కుంభమేళా మొదటి అమృత స్నానం ఏ రోజు? ఏయే తేదీల్లో చేస్తే పుణ్య ఫలితం?-know which dates are more important for amrit snan in mahakumbh mela 2025 check list here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mahakumbh Mela 2025 : మహా కుంభమేళా మొదటి అమృత స్నానం ఏ రోజు? ఏయే తేదీల్లో చేస్తే పుణ్య ఫలితం?

MahaKumbh Mela 2025 : మహా కుంభమేళా మొదటి అమృత స్నానం ఏ రోజు? ఏయే తేదీల్లో చేస్తే పుణ్య ఫలితం?

Anand Sai HT Telugu

MahaKumbh Mela Amrit Snan 2025 : ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ప్రారంభమైంది. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివెళ్తున్నారు. ఇక్కడ అమృత స్నానాలు చేస్తే పుణ్యం దక్కుతుందని నమ్మకం. ఏయే తేదీల్లో చేస్తే మంచిదో చూద్దాం..

మహా కుంభమేళా అమృత స్నానాలు (PIB India)

మహా కుంభమేళా హిందూ మతంలో ఒక ప్రధాన మతపరమైన, సాంస్కృతిక వేడుక. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. మత విశ్వాసాల ప్రకారం ఈ పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం చేస్తే మంచి జరుగుతుంది. పుణ్యం దక్కుతుంది. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేయడం ద్వారా మోక్షాన్ని పొందుతారని నమ్మకం. పాపాలన్నీ పోతాయని చెబుతారు. అమృత స్నానం ప్రాముఖ్యత ఏంటి? ఈ సంప్రదాయం ఎలా ప్రారంభమైంది? 2025లో ఏ తేదీలలో అమృత స్నానం ఉందో తెలుసుకుందాం.

ఈ తేదీల్లో అమృత స్నానాలు

మహా కుంభమేళా సమయంలో మొత్తం మూడు అమృత స్నానాలు ఉంటాయి. వీటిలో మొదటి అమృత స్నానం మకర సంక్రాంతి రోజున జనవరి 14న జరుగుతుంది. రెండో అమృత స్నానం జనవరి 29న మాఘ అమావాస్య నాడు, మూడోది ఫిబ్రవరి 3న వసంత పంచమి నాడు ఉంటుంది. ఇది కాకుండా మాఘ పౌర్ణమి, పుష్య పౌర్ణమి, మహాశివరాత్రి రోజులలో కూడా స్నానాలు చేస్తారు అయితే వీటిని అమృత స్నానంగా పరిగణించరు.

ఎప్పటి నుంచో ఈ స్నానాలు

మహా కుంభ సమయంలో కొన్ని తేదీల్లో జరిగే స్నానాన్ని అమృత స్నానం అని పిలుస్తారు. నాగ సాధువులు భక్తిలో స్నానం చేసే అవకాశం మొదటిదని నమ్ముతారు. ఏనుగులు, గుర్రాలు, రథాలపై స్వారీ చేసి రాజ వైభవంతో రాజులు స్నానం చేస్తారు. ఈ గొప్పతనం కారణంగా దీనికి అమృత స్నానం అని పేరు పెట్టారు.

మరొక నమ్మకం ప్రకారం, పురాతన కాలంలో రాజులు, సాధువులు, ఋషులు ఊరేగింపులో స్నానానికి వెళ్లేవారు. ఈ సంప్రదాయంతో అమృత స్నానం ప్రారంభమైందని కొందరి నమ్మకం. ఈ స్నానం ఆధ్యాత్మిక శుద్ధి, మోక్షానికి మార్గంగా చెబుతారు.

స్నానాలకు ముఖ్యమైన తేదీలు

13 జనవరి (సోమవారం) – పుష్య పౌర్ణమి

14 జనవరి(మంగళవారం) - అమృత స్నానం, మకర సక్రాంతి

29 జనవరి (బుధవారం) - అమృత స్నానం మాఘ అమావాస్య

3 ఫిబ్రవరి (సోమవారం) - అమృత స్నానం, వసంత పంచమి

12 ఫిబ్రవరి (బుధవారం) - స్నానం, మాఘ పౌర్ణమి

26 ఫిబ్రవరి (బుధవారం) - మహాశివరాత్రి

మహాకుంభమేళా భారతీయ సమాజానికి మతపరంగానే కాకుండా సాంస్కృతిక దృక్కోణంలో కూడా చాలా ముఖ్యమైనది. అమృత స్నానంతో పాటు ఆలయ దర్శనం, దానధర్మాలు, ఇతర మతపరమైన ఆచారాలు నిర్వహిస్తారు. మహా కుంభమేళాలో పాల్గొనే నాగ సాధువులు, అఘోరీలు, సన్యాసులు హిందూ మతం వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తారు. ఈ మహాకుంభమేళాను మత విశ్వాసం, సామాజిక ఐక్యత, సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా చెప్పవచ్చు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.