Opinion: పేదల ముద్దుబిడ్డ ... సిద్ధరామయ్య!-know how siddaramaiah become the darling of the poor in karnataka ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Know How Siddaramaiah Become The Darling Of The Poor In Karnataka

Opinion: పేదల ముద్దుబిడ్డ ... సిద్ధరామయ్య!

HT Telugu Desk HT Telugu
May 19, 2023 11:07 AM IST

‘తెలుగునాట దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్‌, వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై ఏ స్థాయి ఆదరణ, అభిమానం ఉన్నదో, అదే స్థాయిలో పేదల పక్షపాతిగా, మాస్‌ లీడర్‌గా కర్ణాటకలో కాంగ్రెస్‌ నాయకుడు సిద్ధరామయ్యకూ పేరుంది..’ - పీపుల్స్ పల్స్ రీసెర్చర్ జి.మురళీకృష్ణ విశ్లేషణ.

సిద్దరామయ్యకు పాలాభిషేకం చేస్తున్న పార్టీ శ్రేణులు
సిద్దరామయ్యకు పాలాభిషేకం చేస్తున్న పార్టీ శ్రేణులు (PTI)

తెలుగునాట దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్‌, వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై ఏ స్థాయి ఆదరణ, అభిమానం ఉన్నదో, అదే స్థాయిలో పేదల పక్షపాతిగా, మాస్‌ లీడర్‌గా కర్ణాటకలో కాంగ్రెస్‌ నాయకుడు సిద్ధరామయ్యకూ పేరుంది. కురబ సామాజిక వర్గానికి చెందిన సిద్ధరామయ్య ఒకప్పుడు బీసీ నేతగా, కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్నారు. కానీ, ఆ తరువాత అదే పార్టీలో చేరి స్వయంకృషితో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఇప్పుడు రెండోసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

కర్ణాటకలో కాంగ్రెస్‌ భారీ విజయం సాధించిన తర్వాత తదుపరి ముఖ్యమంత్రి కోసం సిద్ధరామయ్యతో పాటు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ పోటీపడ్డారు. అయితే ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న 75 ఏళ్ల సిద్ధరామయ్య పార్టీకి చేసిన సేవలను గుర్తించిన కాంగ్రెస్‌ ఆయనకే పట్టం కట్టింది. ఎన్నికల ఫలితాల తర్వాత దేశ వ్యాప్తంగా మీడియా కథనాల్లో డీకే శివకుమార్‌ దూకుడునే ఎక్కువగా ప్రస్తావిస్తూ ఆయనే ముఖ్యమంత్రి అయితే బాగుంటుదనే అభిప్రాయం వ్యక్తమయ్యేలా వార్తల్ని వండివార్చారు.

కర్ణాటక శాసనసభ ఎన్నికల విజయంలో శివకుమార్‌ పోషించిన పాత్ర కీలకమే అయినా, సిద్ధరామయ్య చేసిన కృషి తక్కువేమీ కాదు. గత డిసెంబర్‌ నుంచి పీపుల్స్‌ పల్స్‌ సంస్థ బృందం కర్ణాటకలో మూడుసార్లు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించింది. ఈ సర్వేల్లో భాగంగా కర్ణాటకకు తదపరి ముఖ్యమంత్రిగా ఎవరుండాలని ప్రజలను అడిగినప్పుడు సిద్ధరామయ్య అని 42 శాతం మంది, తాజా మాజీ ముఖ్యమంత్రి బస్వరాజ్‌ బొమ్మై అని 24 శాతం, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అని 17 శాతం, మాజీ ముఖ్యమంత్రి బి.యడియూరప్ప అని 14 శాతం మంది, డి.కె.శివకుమార్‌ అని 3 శాతం మంది చెప్పారు.

అంటే, ప్రజల మనసులో సిద్ధరామయ్య ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారని తేటతెల్లమయ్యింది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అందించిన పరిపాలన, సంక్షేమ పథకాలే వారి అభిమానానికి కొలమానం. అంతేకాదు, కర్ణాటక చరిత్రలో ముఖ్యమంత్రిగా అయిదేళ్ళ పూర్తికాలం పదవిలో ఉన్న రెండో నేత కూడా సిద్ధరామయ్యే. గతంలో దేవరాజ్‌ అర్స్‌ మాత్రమే అయిదేళ్ళు పదవిలో కొనసాగారు.

మైసూరు జిల్లాలోని సిద్ధరామనహుండిలో సిద్ధరామయ్య పుట్టారు. వాళ్లది వ్యవసాయ కుటుంబం. పదేళ్ళ వయసు వచ్చే వరకు ఆయన బడికి పోలేదు. పొలం పనుల్లో సాయం చేస్తూ పశువులు కాశారు. ఆ తరువాత ఆయన డిగ్రీ పూర్తి చేసి, మైసూర్‌ యూనివర్సిటీ నుంచి ‘లా’ పట్టా తీసుకున్నారు. మైసూర్‌ లో చిక్కబోరయ్య అనే లాయర్‌ కింద జూనియర్‌గా ప్రాక్టిస్‌ చేసిన అనంతరం లాయర్‌గా కొనసాగారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ప్రధానంగా మైసూర్‌ ప్రాంతంలోని రైతుల పక్షాన పోరాడుతూ ‘రైతుల లాయర్‌’ గుర్తింపు పొందారు. మైసూర్‌ తాలూక బోర్డ్‌ మెంబర్‌గా కూడా పనిచేశారు. రైతుల్లో ఆయనకున్న ఆదరణ చూసి 1978లో మైసూరు జిల్లా కోర్టులో పరిచయమైన నంజుండస్వామి రాజకీయాల్లోకి రావాల్సిందిగా సిద్దరామయ్యను కోరడంతో ఆయన అనుకోకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

సిద్ధరామయ్య సోషలిస్టు భావజాలంతో పెరిగిన వ్యక్తి. ఆయన మీద సోషలిస్టు రాజకీయ నాయకుడు రామ్‌ మనోహర్‌ లోహియా ప్రభావం చాలా ఉంది. మొదటిసారి సిద్ధరామయ్య జనతా పార్టీ ఎమ్మెల్యే టికెట్‌ కోసం చాలాసార్లు ప్రయత్నించినా ఆనాటి జనతా పార్టీ అధ్యక్షుడు హె.డి దేవేగౌడ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. సిద్ధరామయ్య కచ్చితంగా ఓడిపోతారని, ఆయన జాతీయవాద నాయకుడనే అభిప్రాయంతో దేవేగౌడ ఆయనకు టికెట్‌ నిరాకరించారు. దాంతో కర్ణాటకలో ప్రతి గ్రామానికి నీరు తీసుకొచ్చిన సిద్ధరామయ్య రాజకీయ గురువు అబ్దుల్‌ నజీర్‌ సాబ్‌ సిద్దరామయ్యను ఇండిపెండెంట్‌గా పోటీచేయమని సలహా ఇచ్చారు. అలా 1983లో తొలిసారి చాముండేశ్వరీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటి చేసి ఎమ్మెల్యేగా గెలవడంతో పాత మైసూరు ప్రాంతంలో సిద్ధరామయ్యకు ఒక్కసారిగా గుర్తింపు వచ్చింది.

తొలిసారి ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన రామకృష్ణ హెగ్డే జనతా పార్టీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి, ఆ పార్టీలో చేరారు. కన్నడను అధికార భాషగా ఉంచేందుకు ఏర్పాటు చేసిన కన్నడ కవలు సమితికి సిద్ధరామయ్యను అధ్యక్షునిగా నియమించారు హెగ్డే. కన్నడ భాష కోసం ఆయన చేసిన సేవలను చూసి ముగ్దుడైన దేవేగౌడ, ఆయన్ను తన టీమ్‌లోకి తీసుకున్నారు. 1985 మధ్యంతర ఎన్నికల్లో జనతా పార్టీ 139 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. చాముండేశ్వరీ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచిన సిద్ధరామయ్య, రామకృష్ణ హెగ్డే ప్రభుత్వంలో పశుసంవర్ధకశాఖ మంత్రిగా పదవి చేపట్టారు. అప్పటికే సిద్ధరామయ్య స్టేచర్‌ పెరగుతుందనడానికి ఇది మొదటి సంకేతం.

అప్పుడే ఉప ముఖ్యమంత్రి

దేవేగౌడ సిద్ధరామయ్యతో చేతులు కలిపి మైసూర్‌ ప్రాంతంలో పార్టీని విస్తరించడం మొదలుపెట్టారు. వర్గపోరు వల్ల 1989లో జనతా పార్టీ... జనతాదళ్‌, సమాజ్‌ వాది జనతా పార్టీగా విడిపోయింది. దేవేగౌడకు చెందిన జనతా దళ్‌ వైపు సిద్ధరామయ్య నిలబడ్డారు. 1989లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మళ్లీ చాముండేశ్వరి నుంచి పోటీ చేసిన సిద్ధరామయ్య తొలిసారి ఓటమి చవిచూశారు. 1994లో హెచ్‌డీ దేవెగౌడ నాయకత్వంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో చాముండేశ్వరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సిద్ధరామయ్య ఆర్థికశాఖ మంత్రి అయ్యారు. 1996లో దేవేగౌడ ప్రధానమంత్రి అవ్వడంతో ఏర్పడిన జయదేవప్ప హలప్ప పటేల్‌ ప్రభుత్వంలో సిద్ధరామయ్య ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

1999లో దేవేగౌడ నాయకత్వంలోని ఒక వర్గం జనతా పార్టీ నుంచి విడిపోయి జనతా దళ్‌(సెక్యులర్‌) పేరుతో పార్టీని స్థాపించింది. అప్పుడు కూడా సిద్ధరామయ్య దేవేగౌడ వర్గంతో ఉన్నారు. అయితే అప్పుడు జరిగిన ఎన్నికల్లో చాముండేశ్వరి నుంచి ఓటమి చవిచూశారు. 2004లో అదే చాముండేశ్వరి నుంచి గెలిచి కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌)ల సంకీర్ణ ప్రభుత్వంలో మరోసారి ఉపముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికే జేడీ(ఎస్‌)లో సిద్దరామయ్య అత్యంత శక్తివంతమైన నాయకుడిగా, నెంబర్‌-2 నేతగా ఉండేవారు. దేవగౌడ తప కొడుకు కుమారస్వామిని ముఖ్యమంత్రి చేయడం కోసం సిద్ధరామయ్యను పక్కన పెట్టడటంతో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. ధరమ్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని దింపడానికి కుమార స్వామి బీజేపీతో చేతులు కలపారు. దీన్ని వ్యతిరేకించిన సిద్దరామయ్యను పార్టీ నుంచి బహిష్కరించారు.

2006లో సిద్ధరామయ్య జేడీ(ఎస్‌) నుంచి బయటకు వచ్చి ఆల్‌ ఇండియా ప్రొగ్రెసివ్‌ జనతా దళ్‌ పేరుతో కొత్త పార్టీ పెట్టారు. అదే సంవత్సరం ఆ పార్టీని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేశారు. 2006 ఉపఎన్నికకు వెళ్లి గెలిచారు. అప్పటి నుంచి కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి అన్నీ తానై ముందుండి నడిపించారు. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలుపు తీరాలకు నడిపి, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యారు. అధిష్టానం ప్రమేయం లేకుండా, సీక్రెట్‌ బ్యాలెట్‌ ద్వారా ఎన్నికైన ఏకైక కాంగ్రెస్‌ నాయకుడిగా చరిత్ర సృష్టించారు.

ముఖ్యమంత్రి అయ్యాక ఆయన వినూత్న రీతిలో పరిపాలన అందించారు. అంతకముందు దశాబ్దం నుంచే సీనియర్‌ నాయకుడు ఆర్‌ఎల్‌ జలప్పతో కలిసి సిద్ధరామయ్య రాష్ట్రంలో సోషల్‌ ఇంజినీరింగ్‌ ప్రయోగాలు చేశారు. మైనారిటీ, దళితులు,వెనుబడిన కులాల కోసం కర్ణాటక రాజకీయాల్లో జలప్ప సృష్టించిన అహిండా ఫార్ములాను దేవారాజ్‌ ఆర్స్‌ స్ఫూర్తితో సిద్ధరామయ్య పకడ్బంధిగా అమలు చేశారు. కర్ణాటకలో 80 శాతం జనాభా ఉన్న కులాలు, పేదలు ఈ అహిండా కింద పథకాలతో లబ్ధిపొందాయి. ముఖ్యంగా ఆయన తీసుకొచ్చిన అన్న భాగ్య, క్షీర భాగ్య వంటి సంక్షేమ పథకాలు ఆయన కీర్తిని ఇనుమడింపజేశాయి. దీంతో సిద్ధరామయ్య కూడా ఇక్కడ ఎన్టీఆర్‌, వైఎస్సార్‌ అందుకున్నంత స్థాయిలో కర్ణాటక ప్రజల ఆధరాభిమానాలు అందుకున్నారు.

- జి.మురళికృష్ణ,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ

జి.మురళీకృష్ణ, రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్
జి.మురళీకృష్ణ, రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్
IPL_Entry_Point