Donald Trump : 78 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా డొనాల్డ్ ట్రంప్.. కానీ ఆ ఒక్క సమస్య!
Donald Trump Fitness : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య నివేదికను వైట్ హౌస్ వైద్యులు విడుదల చేశారు. పూర్తి ఫిట్‌గా ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు. కానీ ఒక్క సమస్య గురించి చెప్పారు.
78 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎప్పటికీ వార్తల్లో నిలుస్తున్నారు. టారిఫ్‌లతో ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేశారు. ట్రంప్ నిర్ణయాలు ఒకదాని తర్వాత మరొకటి వాటి అమలు యావత్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా వైట్‌హౌస్ వైద్యులు ట్రంప్ ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా పరీక్షించి పూర్తి ఫిట్‌గా ఉన్నారని నివేదించారు.
ఈ సమస్య
అధ్యక్షుడు ట్రంప్ మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్నారని, దేశాధినేతగా తన విధులన్నీ నిర్వర్తించగలరని వైట్ హౌస్ వైద్యులు తెలిపారు. అయితే డొనాల్డ్ ట్రంప్ చర్మంపై కొన్ని సమస్యలు ఉన్నాయని వైద్యులు నివేదికలో పేర్కొన్నారు. బలమైన సూర్యరశ్మి కారణంగా ఈ సమస్య ఏర్పడింది. దీనికితోడు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయనపై దాడి చేసిన సమయంలో ఆయన చెవిపై గాయమైంది.
మరింత ఫిట్‌గా
కొలెస్ట్రాల్ నియంత్రణకు డొనాల్డ్ ట్రంప్ రెండు మాత్రలు, గుండెను రక్షించే మాత్ర, స్టెరాయిడ్ స్కిన్ క్రీమ్ వాడుతున్నారని నివేదికలో పేర్కొన్నారు. డోనాల్డ్ ట్రంప్ చాలా చురుకుగా ఉంటారని, తరచూ గోల్ఫ్ కూడా ఆడతారని వైద్యులు చెప్పారు. ట్రంప్ తన మొదటి టర్మ్ కంటే ఈసారి మరింత ఫిట్‌గా కనిపిస్తున్నారని, మునుపటితో పోలిస్తే ఆయన బరువు కూడా తగ్గిందని చెబుతున్నారు.
గతంలో డాక్టర్ ఏం చెప్పారంటే
చెకప్ తర్వాత తాను చాలా బాగున్నానని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. 'నేను తెలుసుకోవాలనుకున్నవన్నీ కనుగొన్నాను.' అని అన్నారు. 2015లో డాక్టర్ హెరాల్డ్ బోర్న్ స్టీన్ ఒక లేఖను విడుదల చేస్తూ డొనాల్డ్ ట్రంప్ అత్యంత ఫిట్‌నెస్ ఉన్న అధ్యక్షుడు అని పేర్కొన్నారు. నివేదిక తయారు చేసి లేఖను విడుదల చేయాలని డొనాల్డ్ ట్రంప్ తనను బలవంతం చేశారని డాక్టర్ ఆ తర్వాత ఒక న్యూస్ ఛానెల్‌తో చెప్పారు.
సంబంధిత కథనం