Jagdeep Dhankhar : రెండో అత్యున్న‌తపీఠంపై జాట్ నేత‌-kisan putra lawyer and leader with grassroots connect jagdeep dhankhar is india s new vice president ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  'Kisan Putra', Lawyer And Leader With Grassroots Connect, Jagdeep Dhankhar Is India's New Vice President

Jagdeep Dhankhar : రెండో అత్యున్న‌తపీఠంపై జాట్ నేత‌

ప్ర‌ధాని మోదీ, బీజేపీ చీఫ్ న‌డ్డాతో ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌
ప్ర‌ధాని మోదీ, బీజేపీ చీఫ్ న‌డ్డాతో ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌ (PTI)

ఉప‌రాష్ట్ర‌ప‌తిగా రాజ‌స్తాన్‌కు చెందిన జాట్ నేత‌, ప‌శ్చిమబెంగాల్ మాజీ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ విజ‌యం సాధించారు. జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ భార‌త దేశ 14వ ఉప రాష్ట్ర‌ప‌తిగా ఆగ‌స్ట్ 11న బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ప్ర‌స్తుత ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు ఆగ‌స్ట్ 10న ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తారు.

Jagdeep Dhankhar : ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో అధికార ఎన్డీయే అభ్య‌ర్థిగా జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ ఎంపిక అనూహ్యంగా జ‌రిగింది. క‌శ్మీరీ నేత గులాం న‌బీ ఆజాద్ నుంచి తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్ వ‌ర‌కు.. అనేక పేర్లు తెరపైకి వ‌చ్చాయి. చివ‌ర‌కు ప‌శ్చిమ‌బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ జ‌గదీప్ ధ‌న్‌క‌ర్‌ను ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక చేసి బీజేపీ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ట్రెండింగ్ వార్తలు

Jagdeep Dhankhar : రాజ‌స్తానీ నేత‌

1951 మే 18న‌ రాజ‌స్తాన్‌లోని ఝున్‌ఝున్ జిల్లాలో ఉన్న చిన్న గ్రామం కితానా లో జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ జ‌న్మించారు. జాట్ వ‌ర్గానికి చెందిన వ్య‌వ‌సాయ కుటుంబం వారిది. త‌ల్లిదండ్రులు కేస‌రి దేవి, గోకుల్ చంద్‌. చిత్తోడ్‌గ‌ఢ్‌లోని సైనిక్ స్కూల్‌లో జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ పాఠ‌శాల విద్య పూర్తి చేశారు. రాజ‌స్తాన్ యూనివ‌ర్సిటీ నుంచి న్యాయ విద్య అభ్య‌సించారు. 1979 నుంచి రాజ‌స్తాన్ లో లా ప్రాక్టిస్ ప్రారంభించారు. 2019లో ప‌శ్చిమ‌బెంగాల్ గ‌వ‌ర్న‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించే స‌మ‌యానికి ఆయ‌న రాజ‌స్తాన్ హైకోర్టులో అత్యంత సీనియ‌ర్ న్యాయ‌వాదిగా ఉన్నారు. రాజ‌స్తాన్ హైకోర్టు బార్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్‌గా కూడా ప‌నిచేశారు.

Jagdeep Dhankhar : రాజ‌కీయాల్లో..

నిజానికి బీజేపీలో ఆయ‌న చేరింది సుమారు ప‌దేళ్ల క్రిత‌మే. అంత‌కుముందు జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ జ‌న‌తాద‌ళ్‌, కాంగ్రెస్‌ల్లో ఉన్నారు. 1989లో జ‌న‌తాద‌ళ్ త‌ర‌ఫున ఝున్‌ఝున్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 1990 కేంద్ర ప్ర‌భుత్వంలో స‌హాయ మంత్రిగా విధులు నిర్వ‌ర్తించారు. జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ రైతు నేత దేవీలాల్‌ను త‌న గురువుగా భావిస్తారు. 1993లో కిష‌న్‌గ‌ఢ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

Jagdeep Dhankhar : బీజేపీ నేత‌గా..

2008లో బీజేపీలో చేరారు. జాట్‌ల‌ను ఓబీసీల్లో చేర్చాల‌న్న ఉద్య‌మంలో ఆయ‌న క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. బీజేపీలో అంత సీనియ‌ర్ కాని జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ ను ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. రైతు బిడ్డ‌కు అవ‌కాశ‌మిస్తున్నామ‌ని పేర్కొంటూ ఆయ‌న‌ను బీజేపీ ఎంపిక చేసింది. ప‌శ్చిమ‌బెంగాల్ గ‌వ‌ర్న‌ర్‌గా రాష్ట్ర ప్ర‌భుత్వానికి, ముఖ్య‌మంత్రి మ‌మ‌త బెన‌ర్జీకి వ్య‌తిరేకంగా ప‌లు వ్యాఖ్య‌లు చేయ‌డం వివాదాస్ప‌ద‌మైంది.

WhatsApp channel