రేప్ చేసి 50 సార్లు కత్తితో పొడిచి హత్య.. 43 ఏళ్ల తరువాత కటకటాల్లోకి నిందితుడు-killer who raped stabbed victim over 50 times jailed 40 years later ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  రేప్ చేసి 50 సార్లు కత్తితో పొడిచి హత్య.. 43 ఏళ్ల తరువాత కటకటాల్లోకి నిందితుడు

రేప్ చేసి 50 సార్లు కత్తితో పొడిచి హత్య.. 43 ఏళ్ల తరువాత కటకటాల్లోకి నిందితుడు

HT Telugu Desk HT Telugu

నాలుగు దశాబ్దాల తర్వాత న్యాయం జరిగింది. అమెరికాలో కరెన్ స్టిట్ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడింది. సుమారు 42 ఏళ్ల క్రితం లైంగిక దాడి చేసి 50 సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన కీచకుడు ఎట్టకేలకు ఊచలు లెక్కపెడుతున్నాడు.

కరెన్ స్టిట్ హత్య కేసులో నిందితుడికి జైలు

సుమారు 43 ఏళ్ల క్రితం.. అంటే 1982లో.. అమెరికాలో ఒక దారుణం జరిగింది. 15 ఏళ్ల టీనేజ్ అమ్మాయిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఆ సంఘటన అప్పట్లో ఆ ప్రాంత ప్రజలను తీవ్రంగా కలచివేసింది. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇన్నేళ్లుగా ఆ బాధను మర్చిపోలేక, హంతకుడికి శిక్ష పడాలని ఎదురుచూస్తూ వచ్చారు. చివరికి, ఇన్నేళ్ల నిరీక్షణకు తెరపడింది.. ఆ హత్య కేసులో న్యాయం గెలిచింది.

ఈ కేసులో నిందితుడైన 78 ఏళ్ల గ్యారీ రమీరెజ్ కు ఈ రోజు శిక్ష పడింది. ప్రస్తుతం హవాయిలోని మౌయీలో ఉంటున్న ఇతన్ని, 1982లో కాలిఫోర్నియాలో జరిగిన కరెన్ స్టిట్ హత్య కేసులో దోషిగా తేల్చారు.

కరెన్ స్టిట్ ఆప్పట్లో పాలో ఆల్టోలో హైస్కూల్ విద్యార్థిని. కోర్టు ఈ రోజు గ్యారీ రమీరెజ్ కు జీవిత ఖైదు విధించింది. అయితే, 25 ఏళ్ల తర్వాత అతను పెరోల్ పై విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న గ్యారీ రమీరెజ్ కోర్టులో తనపై ఉన్న ఆరోపణలకు 'నో కాంటెస్ట్'గా అంగీకరించాడు. (అంటే నేరాన్ని పూర్తిగా ఒప్పుకోకపోయినా, కోర్టు శిక్ష విధించడానికి అతను సిద్ధపడ్డాడు అన్నమాట).

శాంటా క్లారా కౌంటీ కోర్టులో జడ్జి హాన్‌లీ చెవ్ ఈ శిక్షను ప్రకటించారు. కోర్టు హాలు మొత్తం కరెన్ స్టిట్ కుటుంబ సభ్యులు, స్నేహితులతో నిండిపోయింది. వాళ్లంతా చాలా ఎమోషనల్ అయ్యారు. తమ అమ్మాయిని దారుణంగా కోల్పోయినప్పటి నుంచి ఇన్నేళ్లు పడిన దుఃఖాన్ని, కోపాన్ని కొందరు కన్నీళ్లతో కోర్టుకు తెలిపారు.

ఈ తీర్పు సందర్భంగా శాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ జెఫ్ రోసెన్ మాట్లాడుతూ.. "40 ఏళ్ల క్రితం కరెన్ స్టిట్ ప్రాణం కోల్పోయింది, కానీ ఆమెను ఎవరూ మర్చిపోలేదు. ఈ రోజు, ఒక అంకితభావంతో పనిచేసిన డిటెక్టివ్, పట్టు వదలని ప్రాసిక్యూటర్, అలాగే మా క్రైమ్ ల్యాబ్‌లోని సిబ్బంది అవిశ్రాంత కృషితో, దీనికి కారణమైన వ్యక్తి కటకటాల వెనుకకు వెళ్ళాడు" అని అన్నారు.

అసలు ఆ రోజు ఏం జరిగింది?

1980ల ప్రారంభంలో కాలిఫోర్నియాలోని బే ఏరియా ప్రాంతాన్ని ఈ హత్య ఉలిక్కిపడేలా చేసింది. 1982, సెప్టెంబర్ 2వ తేదీ రాత్రి.. కరెన్ స్టిట్ తన పాలో ఆల్టోలోని ఇంటి నుంచి బస్సులో సన్నీవేల్‌లో ఉండే తన బాయ్‌ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్లింది. అర్ధరాత్రి సమయంలో, ఆమె మళ్ళీ ఇంటికి బయలుదేరింది. ఎల్ కామినో రియల్ మరియు వోల్ఫ్ రోడ్ దగ్గర ఉన్న బస్ స్టాప్ వైపు నడుచుకుంటూ వెళ్తోంది. మరుసటి రోజు ఉదయం, ఆ బస్ స్టాప్ కు కేవలం 100 గజాల దూరంలో.. రక్తం మరకలు అంటిన ఒక గోడ పక్కన ఆమె శరీరాన్ని గుర్తించారు. ఆమెపై లైంగిక దాడి చేసి, 50 కన్నా ఎక్కువ సార్లు కత్తితో పొడిచి అత్యంత దారుణంగా చంపేసినట్టు గుర్తించారు.

హత్య జరిగిన చోట హంతకుడి రక్తం, ఇతర శరీర ద్రవాలు దొరికినా, దశాబ్దాల పాటు ఆ నిందితుడు ఎవరో తెలియలేదు. పోలీసులు ఎన్నోసార్లు దర్యాప్తు చేసినా, అతన్ని పట్టుకోలేకపోయారు. కేసు అంతు చిక్కకుండా ఉండిపోయింది.

మలుపు తిప్పిన దర్యాప్తు.. దొరికిన కీలక ఆధారం

అయితే, 2019లో ఈ కేసు దర్యాప్తులో ఒక కీలక మలుపు తిరిగింది. సన్నీవేల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీకి చెందిన డిటెక్టివ్ మాట్ హచిసన్ కు ఒక ముఖ్యమైన సమాచారం అందింది. ఆ సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఆయన, ఫ్రెస్నో ప్రాంతానికి చెందిన నలుగురు అన్నదమ్ముల బృందం దగ్గరికి చేరుకున్నారు.

వాళ్ల నుంచి శాంపిల్స్ సేకరించి ఆధునిక జన్యు విశ్లేషణ (జెనెటిక్ అనాలిసిస్) చేయగా, షాకింగ్ నిజం బయటపడింది. 2022 ఏప్రిల్‌లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం.. కరెన్ స్టిట్ శరీరంపై దొరికిన డీఎన్‌ఏ ఆ నలుగురు అన్నదమ్ముల్లో ఒకరైన గ్యారీ రమీరెజ్ దే అని తేలింది. శాంటా క్లారా కౌంటీ క్రైమ్ ల్యాబ్ కూడా ఈ డీఎన్‌ఏ మ్యాచింగ్‌ను ధృవీకరించింది. దీంతో దశాబ్దాల తర్వాత అసలు హంతకుడు ఎవరో గుర్తించగలిగారు.

ఈ కేసులో పాలు పంచుకున్న ఒక ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ.. "ఈ రోజు నిందితుడికి శిక్ష పడటం అనేది ఇన్నేళ్లుగా మేము పట్టు వదలకుండా చేసిన ప్రయత్నానికి ఫలితం. ఇది కాలగర్భంలో కలిసిపోయి, చరిత్రలో ఒక సంఘటనగా మిగిలిపోవాల్సిన నేరం కాదు. మా దర్యాప్తు బృందం పట్టుదల, అలాగే చాలా చిన్న వయసులోనే దారుణంగా ప్రాణాలు కోల్పోయిన ఆ అమ్మాయి కరెన్ స్టిట్ జ్ఞాపకం వల్లే ఇది సాధ్యమైంది" అని భావోద్వేగంతో అన్నారు.

ఎన్నో ఏళ్లుగా మిస్టరీగా ఉన్న ఈ కేసులో, ఆధునిక టెక్నాలజీ అయిన డీఎన్‌ఏ టెస్టింగ్, పోలీసుల పట్టుదల వల్లే చివరికి అసలు నిందితుడు దొరికాడు. దారుణ హత్యకు గురైన ఆ 15 ఏళ్ల అమ్మాయికి, ఆమె కుటుంబానికి దశాబ్దాల తర్వాత అయినా న్యాయం దక్కింది.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.