Kerala rape case : యువతిపై 2ఏళ్లుగా అత్యాచారం- 60 మంది అనుమానితుల్లో కోచ్‌లు, క్లాస్మేట్స్, స్థానికులు!
కేరళలోని ఓ 18ఏళ్ల యువతిపై అనేకమార్లు అత్యాచారం జరిగింది! ఈ ఘటనపై 4 కేసులు నమోదయ్యాయి. కాగా 60మంది అనుమానితుల్లో కోచ్‌లు, క్లాస్మేట్స్, స్థానికులు ఉన్నారు.
కేరళలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! ఓ 18ఏళ్ల యువతి గత రెండేళ్లుగా అత్యాచార ఘటనలు ఎదుర్కొంటూ వస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన 60 మంది అనుమానితుల్లో క్లాస్మేట్స్, స్థానికులు, కోచ్‌లు ఉన్నారు.
ఇదీ జరిగింది..
కేరళ పతనంతిట్టలో రెండేళ్ల కాలంలో సదరు యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో పోలీసులు ఇప్పటివరకు నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఆరుగురిని అరెస్టు చేశారు.
రెండు నెలల క్రితం 18 ఏళ్లు నిండిన సదరు యువతి.. 16 ఏళ్ల వయసు నుంచి పలుమార్లు అత్యాచారానికి గురైంది.
బాధితురాలు ఒక క్రీడాకారిణి అని, కానీ గత కొంత కాలంగా ఆమెలో మార్పులు వచ్చాయని తెలుస్తోంది. ఆ మార్పులను గుర్తించిన ఓ టీచర్, ఆ విషయాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి చెప్పారు. ఫలితంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
రెండు ఎఫ్ఐఆర్లకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేశామని, మరో వ్యక్తి ఇప్పటికే వేరే కేసుకు సంబంధించి జైలులో ఉన్నాడని కేరళ పోలీసులు తెలిపారు.
కోచ్‌లు, క్లాస్మేట్స్ ప్రమేయం!
పతనంతిట్ట చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ రాజీవ్ ఎన్ ప్రకారం.. పాఠశాల కౌన్సెలింగ్ సెషన్లో టీనేజర్ మొదట తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడింది. ఆ తరువాత కౌన్సిలర్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీని సంప్రదించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసు కేసు నమోదైంది.
కేరళలోని పతనంతిట్టలో క్రీడా శిబిరాలతో పాటు పలు చోట్ల కోచ్‌లు, తోటి విద్యార్థులు, స్థానికులు బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బాధితురాలికి పర్సనల్ ఫోన్ లేదని, తన తండ్రి మొబైల్‌ను ఉపయోగించి తనను వేధింపులకు గురిచేసిన సుమారు 40 మంది నంబర్లను సేవ్ చేసిందని పోలీసులు తెలిపారు.
ఆరోపణలు నిజమని నిర్ధారించుకునేందుకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు బాధితురాలిని సైకాలజిస్ట్ వద్దకు కౌన్సిలింగ్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ కేసు అసాధారణమైనదిగా గ్రహించిన తర్వాత పోలీసులకు సమాచారం అందించామని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ తెలిపారు.
ఈ వ్యవహారంపై జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పోక్సో చట్టంతో పాటు క్రిమినల్ చట్టంలోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
సంబంధిత కథనం