Kerala fireworks accident : ఆలయంలో బాణాసంచా పేలి 150మందికి గాయాలు- షాకింగ్​ లైవ్​ వీడియో..-kerala over 150 injured 8 critical in fireworks accident at temple festival ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kerala Fireworks Accident : ఆలయంలో బాణాసంచా పేలి 150మందికి గాయాలు- షాకింగ్​ లైవ్​ వీడియో..

Kerala fireworks accident : ఆలయంలో బాణాసంచా పేలి 150మందికి గాయాలు- షాకింగ్​ లైవ్​ వీడియో..

Sharath Chitturi HT Telugu

కేరళ కసర్​గోడ్​ జిల్లాలోని ఓ ఆలయంలో బాణాసంచా పేలుడు ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో 150మంది గాయపడ్డారు. వీరిలో 8మంది పరిస్థితి విషమంగా ఉంది.

ఆలయంలో బాణాసంచా పేలుడు..

బణాసంచా పేలుడు ప్రమాదంతో కేరళ కసర్​గోడ్​ ఉలిక్కిపడింది! నీలేశ్వరంలోని ఓ ఆలయంలో బాణాసంచా పేలి, భారీ అగ్నిప్రమాదానికి దారితీసింది. ఈ ఘటనలో 150మంది గాయపడ్డారు. వీరిలో 8మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదీ జరిగింది..

కసర్​గోడ్​ నీలేశ్వరంలోని అంజుట్టంబలం వీరార్​ కావు ఆలయంలో సోమవారం అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. థేయంకట్ట మహోత్సవాన్ని చూసేందుకు ఆలయానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. వేడుకల్లో భాగంగా బాణాసంచా కాల్చడం మొదలుపెట్టారు. అయితే, బాణాసంచా వెళ్లి పక్కనే ఉన్న ఓ గదిలో పడింది. ఆ గదిలో అప్పటికే భారీ సంఖ్యలో బాణాసంచా ఉండటంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. చివరికి మంటలు చెలరేగాయి. ఫలితంగా అప్పటివరకు ఆహ్లాదకరంగా ఉన్న ఆలయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ప్రజలు షాక్​కు గురయ్యారు. పేలుడు అనంతరం ప్రాణాలు కాపాడుకునేందుకు పలువురు పరుగులు తీయడంతో స్వల్ప తొక్కిసలాట కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 150మంది గాయపడినట్టు తెలుస్తోంది.

ఇదీ చూడండి:- TG Diwali Crackers : బాణసంచాతో జాగ్రత్త.. పొంచి ఉన్న అగ్ని ప్రమాదాలు.. ఈ 10 జాగ్రత్తలు పాటించండి

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి వెళ్లారు. పోలీసులు, స్థానికులు కలిసి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షతగాత్రులను నీలేశ్వరం, కనహంగద్​లోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని కన్నూర్​లోని పరియారం మెడికల్​ కాలేజ్​కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వారిని మంగళూరులోని హాస్పిటల్​కి తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

జిల్లా కలెకటర్​ కే ఇంపశేఖర్​, జిల్లా పోలీసు చీఫ్​ డీ శిల్ప, ఇతర అధికారులు సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందివ్వాలని ఆదేశాలు సైతం ఇచ్చారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాలని ప్రజలు, వ్యవస్థలకు సూచనలు ఇచ్చారు.

అనుమతి లేకుండా ఆలయ ఆవరణలోనే బాణసంచా కాల్చారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా, బాణసంచాకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలుస్తోంది.

కేరళ పోలీసులు ఆలయ అధ్యక్షుడు, కార్యదర్శిని అదుపులోకి తీసుకున్నారని న్యూస్ 18 మలయాళం నివేదించింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఆన్​లైన్​లో వైరల్​గా మారాయి. పేలుడు దృశ్యాలు అందరిని భయపెట్టే విధంగా ఉన్నాయి.

అనధికారిక దుకాణంలో..

దీపావళికి ముందు బాణాసంచా ప్రమాదాల ఘటనలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌ అబిడ్స్‌ పరిధిలోని బొగ్గుల కుంటలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారాస్‌ బాణాసంచా దుకాణంలో జరిగిన పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. పక్కనే ఉన్న ఓ హోటల్‌కు మంటలు వ్యాపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. రాత్రి విక్రయాలు జరుగుతున్న సమయంలో ఘటన చోటు చేసుకోవడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మూడు ఫైరింజన్లతో మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో పదికి పైగా ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.