141 years of jail term: కూతురిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి 141 ఏళ్ల జైలు శిక్ష
Kerala crime news: సవతి కూతురిపై పదేపదే అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి కేరళ కోర్టు 141 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బీఎన్ఎస్, పోక్సొ, జువెనైల్ జస్టిస్ తదితర చట్టాల్లోని పలు సెక్షన్ల ప్రకారం కేరళ కోర్టు ఈ శిక్ష విధించింది.
Kerala crime news: తల్లి ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో కొన్నేళ్లుగా తన సవతి కూతురిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని దోషిగా నిర్ధారించిన కేరళ కోర్టు అతనికి మొత్తం 141 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పోక్సో చట్టం, బీఎన్ఎస్, జువెనైల్ జస్టిస్ చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం మంజేరి ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అష్రఫ్ ఏఎం నిందితుడికి 141 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
కొన్నేళ్లుగా ఈ దారుణం
ఆ తండ్రి తన సవతి కూతురిపై ఈ దారుణానికి కొన్నేళ్లుగా పాల్పడుతున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆ చిన్నారిని బెదిరించేవాడు. దాంతో, భయపడిపోయిన ఆ పాప, తన తండ్రి లైంగిక వేధింపులు భరించలేక చివరకు తన తల్లికి చెప్పేసింది. ఆ తల్లి తన స్నేహితురాలి సలహా మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మొత్తం 40 ఏళ్ల జైళ్లోనే..
విచారణ అనంతరం మంజేరి ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అష్రఫ్ ఏఎం నిందితుడికి 141 ఏళ్ల జైలు శిక్ష విధించారు. కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, ఆ వ్యక్తికి విధించిన గరిష్ట జైలు శిక్ష 40 సంవత్సరాలు. మొత్తం జైలు శిక్షాకాలం 141 ఏళ్లు అయినప్పటికీ.. పలు శిక్షలను ఏకకాలంలో అమలు చేయనున్నారు. జైలు శిక్షతో పాటు ఆ దోషికి కోర్టు రూ.7.85 లక్షల జరిమానా విధించింది. బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారి ప్రకారం, బాధితురాలు మరియు దోషి ఇద్దరూ తమిళనాడుకు చెందినవారు. ఆ చిన్నారిని ఆమె సవతి తండ్రి 2017 నుండి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు.