Kerala crime news: హత్య కేసులో 15 మందికి ఉరిశిక్ష; కేరళ కోర్టు సంచలన తీర్పు
Death sentence to 15 PFI members: బీజేపీ నేత హత్య కేసులో 15 మంది దోషులకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పును కేరళలోని ఒక సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ఒకే కేసులో ఇంత భారీ సంఖ్యలో దోషులకు ఉరిశిక్ష విధించడం ఇదే ప్రథమమని భావిస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ (BJP) ఓబీసీ నాయకుడు రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) కు చెందిన 15 మందికి కేరళ కోర్టు మంగళవారం మరణశిక్ష విధించింది. ఆ 15 మంది నిషేధిత తీవ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, దాని రాజకీయ విభాగమైన సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) కు చెందిన వారుగా తేలింది.
కుటుంబ సభ్యుల ముందే కిరాతకంగా..
దోషులుగా తేలిన 15 మంది నిందితులను కోర్టు జనవరి 20న దోషులుగా నిర్ధారించింది. అనంతరం, జనవరి 30న వారికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పును మావెలిక్కర అదనపు జిల్లా జడ్జి వీజీ శ్రీదేవి తీర్పు వెలువరించారు. తల్లి, పిల్లలు, భార్య కళ్లెదుటే బాధితుడిని దారుణంగా, కిరాతకంగా హతమార్చిన తీరు అత్యంత అరుదైన నేరాల పరిధిలోకి తీసుకువస్తుందని పేర్కొంటూ దోషులకు గరిష్ట శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరింది. ఆయన శరీరంపై 56కు పైగా గాయాలు ఉన్నాయని తెలిపింది. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న శ్రీనివాసన్ హత్య కేసులో నిందితులందరూ దోషులుగా తేలినట్లు ప్రాసిక్యూషన్ తెలిపింది. నేరం సమయంలో రంజిత్ తల్లి, సోదరిపై శారీరకంగా దాడి చేయడం, గృహోపకరణాలను ధ్వంసం చేయడం వంటి ఇతర నేరాలు కూడా రుజువయ్యాయని తెలిపింది.
ప్రతీకారంగానే..
దోషులను పీఎఫ్ఐ (PFI) కు చెందిన నైసమ్, అజ్మల్, అనూప్, మహ్మద్ అస్లాం, సలాం, సఫరుద్దీన్, అబ్దుల్ కలాం, మన్షాద్, జసీబ్ రాజా, నవాస్, సమీర్, నజీర్, జాకీర్ హుస్సేన్, షాజీ, షెర్నాస్ అష్రఫ్ గా గుర్తించారు. 2021 డిసెంబర్ 19న ఉదయం అలప్పుజ పట్టణంలోని వెల్లకినార్ లో ఉన్న తన ఇంట్లో 40 ఏళ్ల రంజిత్ శ్రీనివాసన్ ను 12 మంది సభ్యుల ముఠా పదునైన ఆయుధాలతో నరికి చంపింది. రంజిత్ శ్రీనివాసన్ తల్లి, భార్య, చిన్న కుమార్తె కళ్ల ముందే ఈ దారుణానికి ఒడిగట్టారు. అంతకుముందు రోజు అలప్పుజ జిల్లాలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యకర్తలు ఎస్డీపీఐ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ షాన్ ను హత్య చేసినందుకు ప్రతీకారంగా శ్రీనివాసన్ ను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది.