Road Accidents : కర్ణాటకలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 13 మంది దుర్మరణం.. మృతుల్లో ఏపీకి చెందిన నలుగురు
Karnataka Road Accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూరగాయల లోడుతో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. మరోవైపు రాయచూరులో జరిగిన ప్రమాదంలో ఏపీకి చెందిన నలుగురు మృతి చెందారు.
ఉత్తర కన్నడ జిల్లా యాల్లాపూర్ తాలుకాలోని గుల్లాపురలో కూరగాయల లోడుతో వెళ్తు్న్న ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. దట్టమైన పొగమంచు కారణంగా రహదారి సరిగా కనిపంచక ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ట్రక్కులో కూరగాయలతో 20 మందికిపైగా ప్రయాణిస్తున్నారు.
జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. కూరగాయలతో నిండిన ట్రక్కులో 20 మందికి పైగా కూర్చున్నారు. సవనూరు నుంచి కుమటకు బయలుదేరింది వాహనం. జాతీయ రహదారిపై ఉదయం పొగమంచు కమ్ముకుంది. రోడ్డు సరిగా కనిపించకపోవడంతో ట్రక్కు బోల్తా పడింది. మృతులంతా సవనూరుకు చెందిన వారని చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని హుబ్లీలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కూరగాయల కుప్పల కింద కూరుకుపోయిన మృతదేహాలను బయటకు తీశారు.
ఏపీకి చెందిన నలుగురు మృతి
రాయచూర్‌లో కర్నూలు జిల్లా మంత్రాలయానికి చెందిన శ్రీరాఘవేంద్రస్వామి మఠం వేద పాఠశాల వాహనం బోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులతో సహా డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. పది మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
కర్ణాటకలోని బళ్లారి జిల్లా హంపిలోని శ్రీ నరహరి తీర్థుల బృందావనంలో ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. ఉదయం 10 గంటలకు ఆరాధన ఉండడంతో మంగళవారం రాత్రి మంత్రాయం నుంచి వాహనంలో డ్రైవర్‌తో సహా 14 మంది బయలుదేరారు. కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని సింధనూర్ తాలూకా సమీపంలో వాహనం టైర్ పేలీ పల్టీలు కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 10 మంది తీవ్రంగా గాయలుపాలయ్యారు. మంత్రాలయం సంస్కృత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అయవందనన్ (18), సుజేంద్ర (22), అభిలాష్ (20), డ్రైవర్ శివ (24) అక్కడికక్కడే మృతి చెందారు.