Liquor bandh : మందుబాబులకు బ్యాడ్ న్యూస్! రాష్ట్రవ్యాప్తంగా ఆ రోజు లిక్కర్ విక్రయం బంద్..
Liquor bandh in Karnataka : మందుబాబులకు బ్యాడ్ న్యూస్! రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20న లిక్కర్ బంద్ని ప్రకటించింది కర్ణాటక వైన్ మర్చెంట్ ఫెడరేషన్. దీనికి కారణాలను వివరించింది..
కర్ణాటకలో నివాసముండే మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్! ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ బంద్ని పిలుపునిచ్చింది కర్ణాటక వైన్ మర్చంట్స్ ఫెడరేషన్. రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.
మద్యం అమ్మకాలు బంద్..!
రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో అవినీతికి నిరసనగా 10,800 లైసెన్స్ పొందిన సంస్థలు ఏకతాటిపైకి రావడంతో నవంబర్ 20న రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు సిద్ధమవుతున్నట్లు ఫెడరేషన్ ప్రతినిధులు తెలిపారు. విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతి, అన్యాయమైన పోటీ తమ వ్యాపారాలను దెబ్బతీస్తోందన్న వ్యాపారుల ఆందళనలను వెలుగులోకి తీసుకురావడమే ఈ బంద్ ప్రధాన లక్ష్యమని ఫెడరేషన్ ప్రతినిధులు చెబుతున్నారు.
ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి గోవిందరాజ్ హెగ్డే మాట్లాడుతూ బంద్ నేపథ్యంలో మద్యం లైసెన్స్ హోల్డర్లలో భాగస్వామ్యం 85 నుంచి 90 శాతానికి చేరుకుంటుందని, ఇది పరిశ్రమ అంతటా ఐక్యతకు నిదర్శనమన్నారు. పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, వ్యాపార వర్గాల్లో పెరుగుతున్న నిస్పృహను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం కొత్త లైసెన్సులు జారీ చేస్తూనే ఉందని, ఉన్న నిబంధనలను విస్మరించి, చాలా మంది తట్టుకోలేని తీవ్రమైన పోటీ వాతావరణాన్ని సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. ఏడాదికి సుమారు రూ.38,000 కోట్ల ఆదాయం సమకూరుస్తున్న దుకాణాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.
పరిస్థితులు చేయిదాటిపోతున్నాయని, నిబంధనలను ఏమాత్రం లెక్కచేయకుండా కొత్త లైసెన్సులు ఇస్తూ ప్రభుత్వం అనియంత్రిత పోటీకి తెరతీస్తోందన్నారు హెగ్డే. రాష్ట్రంలో ఏడాదికి రూ.38 వేల కోట్ల వ్యాపారం చేస్తున్నామని, అయితే శాఖలో అవినీతి కారణంగా చాలా మంది డీలర్లు తమ వ్యాపారాన్ని కొనసాగించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
లైసెన్స్ పొందిన దుకాణాలను అప్రతిహతంగా విస్తరించడం తమ సవాళ్లను మరింత పెంచిందని, చాలా మంది చిన్న, మధ్యతరహా లైసెన్స్ హోల్డర్లు తాము పోటీ పడలేకపోతున్నారని, ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. అనేక వ్యాపారాలు తమ దుకాణాలను నడపడానికి అస్థిరమైన చక్రంలోకి తోసేస్తున్నారని ఫెడరేషన్ పేర్కొంది.
ఇది మొదటిసారి కాదు..!
శాఖాపరమైన అవినీతి, లైసెన్సింగ్ విధానాలపై కర్ణాటక వైన్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఏదేమైనా, ఈ భారీ స్థాయి బంద్ వ్యాపార వర్గాల్లో పెరుగుతున్న అసంతృప్తిని సూచిస్తుంది. అర్థవంతమైన సంస్కరణలను అమలు చేయాలనే పరిశ్రమ సంకల్పాన్ని హైలైట్ చేస్తుంది. తమ జీవనోపాధిపై కొత్త లైసెన్సుల ప్రభావాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ లిక్కర్ బంద్, వైన్ వ్యాపారులు తమ ఫిర్యాదులపై దృష్టిని ఆకర్షించడమే కాకుండా, న్యాయమైన, మరింత స్థిరమైన వ్యాపార వాతావరణాన్ని పెంపొందించడానికి లైసెన్సింగ్ విధానాలను రీవాల్యుయేషన్ చేయాలని భావిస్తున్నారు.
సంబంధిత కథనం