కర్ణాటక బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఐపీఎల్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో 11 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారు. దీనిని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆర్సీబీ మార్కెటింగ్ చీఫ్ నిఖిల్ సోసలేతో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్‌వర్క్స్‌కు చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లను అరెస్ట్ చేశారు. ఇప్పటికీ ఈ ఘటనకు సంబంధించి నలుగురు అరెస్ట్ అయ్యారు. అరెస్టు సమయంలో నిఖిల్ సోసలే ముంబై వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లాడు.
ఇప్పటికే బెంగళూరు పోలీస్ కమిషనర్ బి.దయానంద్‌తో పాటు పలువురు సీనియర్ పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సీనియర్ ఐపీఎస్ అధికారి సీమంత్ కుమార్ సింగ్‌ను బెంగళూరు పోలీస్ కమిషనర్‌గా నియమించారు. ఆర్సీబీ టీమ్, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్(కేఎస్సీఏ) ప్రతినిధులను అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఆ తర్వాత కొన్ని గంటలకే నిఖిల్‌పై హత్యానేరం సహా పలు అభియోగాలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాజీనామా చేయాలని, ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఈ దుర్ఘటనపై కూలంకషంగా చర్చించారు.
ఈ ఘటనపై విచారణను కర్ణాటక హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి మైఖేల్ కున్హా నేతృత్వంలోని ఏకసభ్య జ్యుడీషియల్ కమిషన్‌కు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించిందని, 30 రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిషన్‌ను కోరినట్లు తెలిపారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్సీబీ, డీఎన్ఏ ఈవెంట్ మేనేజర్లు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) ప్రతినిధులను వెంటనే అరెస్టు చేయాలని రాష్ట్ర డీజీపీ, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ)లను ఆదేశించినట్లు తెలిపారు.