'నా చావు నా భార్య చిత్రహింసల వల్లే'.. ఆత్మహత్య తర్వాత శవపేటికపై వ్యక్తి చివరి కోరిక
Karnataka News : భార్య వేధింపులు తట్టుకోలే ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు ఇటీవల ఎక్కువ అవుతున్నాయి. అతుల్ సుభాష్ ఘటన మరవకముందే వరుసగా మరికొన్ని బయటకు వచ్చాయి. తాజాగా కర్ణాటకలోనూ ఓ వ్యక్తి భార్య వేధింపులతో చనిపోతున్నట్టుగా సూసైడ్ నోట్ రాశాడు.
భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్యలకు పాల్పడుతున్న కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో ఘటన జరిగింది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఓ వ్యక్తి, అతని భార్య వేధింపులు భరించలేక డెత్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య టార్చర్ తట్టుకోలేక చనిపోయాడని మృతుడి బంధువులు దహన సంస్కారాల పెట్టెపై ఆ విషయం రాశారు.

హుబ్బళ్లిలోని చాముండేశ్వరి నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. భార్య వేధింపులతో విసిగిపోయి పీటర్ అనే వ్యక్తి డెత్ నోట్ రాసి మరణించాడు. చాలా రోజులుగా భర్త పీటర్, భార్య పింకీ మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో విసిగిపోయిన పీటర్ ప్రాణాలు తీసుకున్నాడు. వీరిద్దరూ రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారని, పెళ్లయిన మూడు నెలల తర్వాత తరచూ గొడవలు జరగడంతో విడివిడిగా ఉంటున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. పింకీ తన భర్త నుండి విడాకులు కావాలని దరఖాస్తు చేసింది. 20 లక్షలు భరణం అడిగింది.
జనవరి 27న ఆదివారం కావడంతో అందరూ చర్చికి వెళ్లారు. కుటుంబ సభ్యులు మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి పీటర్ ఉరివేసుకుని కనిపించాడని మృతుడి సోదరుడు ఏశయ్య తెలిపారు. దగ్గరలోనే సూసైడ్ నోట్ దొరికింది. పీటర్ తన మరణానికి తన భార్య కారణమని రాశాడు. 'నాన్న, నన్ను క్షమించండి. నా భార్య నన్ను చంపుతోంది. ఆమె నా చావును కోరుకుంటుంది. అన్న అమ్మానాన్నలకు సరిగా చూసుకో.' అని పీటర్ రాశాడు.
తన భార్య క్రూరత్వం వల్లే తన మరణం అని తన శవపేటిక, సమాధిపై ఈ విషయాన్ని రాయమని సూసైడ్ నోట్‌లో రాశాడు పీటర్. ఈ చివరి కోరిక అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. బాధితుడి కోరిక మేరకు అతడి కుటుంబం నోట్‌ను బయటకు విడుదల చేసింది.
తన సోదరుడికి న్యాయం చేయాలని ఏశయ్య కోరుతున్నాడు. పీటరు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడని, మూడు నెలల క్రితం ఉద్యోగం కోల్పోయాడని చెప్పాడు. 'ఆ మహిళను అరెస్టు చేయాలి. నా సోదరుడు అనుభవించిన టార్చర్ ఎవరూ బాధపడకూడదు. ఆమె మా సోదరుడిని కొట్టేది. దాని గురించి పోలీసు నివేదిక కూడా ఉంది.' అని ఏశయ్య చెప్పారు.
బాధితుడి సోదరుడి ఫిర్యాదు ఆధారంగా మహిళపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 108 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ చేస్తున్నట్టుగా వెల్లడించారు.
ఇటీవలే 34 ఏళ్ల టెక్కీ అతుల్ సుభాష్ తన భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగా బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. డెత్ నోట్‌లో సుభాష్ తన భార్యతోపాటు ఆమె బంధువులు తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. తీవ్ర మానసిక వేదనకు గురిచేశారని ఆరోపించాడు.