Karnataka Governor: కర్నాటక గవర్నర్ తావర్ చంద్ కు కోవిడ్; బెంగళూరులో పెరుగుతున్న కేసుల సంఖ్య
Karnataka Governor: కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సోమవారం కర్నాటకలో కొత్తగా 279 కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి.
Karnataka Governor: కర్నాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ఒ ప్రకటన విడుదల చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రాజ్ భవన్ లో క్వారంటైన్ లో ఉంన్నారని తెలిపింది.
క్వారంటైన్ లో..
‘‘కర్నాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కు కరోనా పాజిటివ్ (corona) గా నిర్ధారణ అయింది. ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం ఆయన రాజ్ భవన్ లోనే క్వారంటైన్లో ఉన్నారు. తదుపరి సమాచారం వచ్చే వరకు గవర్నర్ పాల్గొనాల్సిన కార్యక్రమాలను రద్దు చేస్తున్నాం’’ అని గవర్నర్ కార్యాలయం తెలిపింది.
279 కొత్త కేసులు
సోమవారం కర్నాటకలో 279 కొత్త కోవిడ్ -19 (COVID 19) కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఆదివారం ఒక మరణం నమోదు కాగా, కొత్తగా, సోమవారం మూడు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు కూడా 8.61 శాతం నుంచి 4.38 శాతానికి తగ్గింది. 235 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,222 గా ఉంది.
బెంగళూరులో అత్యధికం..
కర్నాటకలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 40.93 లక్షలుగా ఉంది. కొత్తగా నమోదైన 279 ఇన్ఫెక్షన్లలో 134 ఒక్క బెంగళూరు నగరంలోనే నమోదయ్యాయని, ప్రస్తుతం బెంగళూరులో మొత్తం 593 యాక్టివ్ కేసులు ఉన్నాయని కర్నాటక ఆరోగ్య శాఖ వెల్లడించింది. వృద్ధులు, గర్భిణులు బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని కర్నాటక ప్రభుత్వం ఇప్పటికే సూచించింది.