కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ మృతి కేసులో మరో కీలక విషయం వెలుగుచూసింది. ఓం ప్రకాశ్ భార్య పల్లవి.. గొంతు కోస్తే ఓ వ్యక్తి ఎలా చనిపోతాడనే సమాచారాన్ని గూగుల్‌లో సెర్చ్ చేసిందని తెలుస్తోంది. ఎక్కడ నరాలు తెగితే మనిషి త్వరగా చనిపోతాడో ఆమె తెలుసుకుందని పోలీసులు వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉంది. విచారణ జరుపుతున్నారు.
మెడ దగ్గర సిర, రక్తనాళాలు తెగిపోయినప్పుడు ఒక వ్యక్తి ఎలా చనిపోతాడో తెలుసుకోవడానికి పల్లవి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసింది. చంపడానికి 5 రోజుల ముందు పల్లవి ఈ సెర్చింగ్ చేసింది. కత్తితో పొడిచే ముందు ఓం ప్రకాశ్ ముఖంపై పల్లవి కారంపొడి చల్లినట్లు పోలీసులు గుర్తించారని పోలీసు వర్గాలు తెలిపాయి. తీవ్ర వాగ్వాదం తర్వాత పల్లవి ప్రకాశ్ ముఖంపై కారంపొడి చల్లింది. ఆవేశంతో ప్రకాశ్ అటూ ఇటూ తిరుగుతుండగా పల్లవి కత్తితో పలుమార్లు పొడిచింది. దీంతో మాజీ డీజీపీ అక్కడికక్కడే మృతి చెందారు.
ఓం ప్రకాశ్‌ను ఆయన భార్య పల్లవి, కుమార్తె కృతి పథకం ప్రకారమే చంపినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. తానే హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడించింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. హత్యలో కృతి పాత్రపై కూడా విచారణ జరుగుతుంది. ప్రస్తుతం పల్లవి 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీలో ఉంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు సోమవారం ఘటన స్థలానికి తీసుకెళ్లి ప్రశ్నించారు.
బీహార్‌కు చెందిన 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఓం ప్రకాశ్ ఆదివారం బెంగళూరులోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన మృతదేహం కనిపించింది. గత వారం రోజులుగా పల్లవి తన తండ్రిని చంపేస్తానని బెదిరిస్తోందని ప్రకాష్ కుమారుడు కార్తికేయ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.