30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి వరుడి కోసం వెతుకుతున్న కుటుంబం
30 సంవత్సరాల క్రితం కన్నుమూసిన వధువు కోసం వరుడిని వెతకడం అనే అంశం సంచలనంగా మారింది. ఇది ఎక్కడ జరిగింది?
మూడు దశాబ్దాల క్రితం మరణించిన ఓ మహిళకు వరుడిని వెతుకుతున్నట్టు ఇటీవల పత్రికల్లో వచ్చిన ప్రకటన దక్షిణ కన్నడ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరులోని ఒక కుటుంబం నుండి వచ్చిన ఈ అసాధారణ ప్రకటన ప్రకారం.. చనిపోయిన తమ కుమార్తెకు వివాహం జరిపించాలని ఆ కుటుంబం లక్ష్యంగా పెట్టుకుంది. మరణానంతర జీవితంలో ఆమె అవివాహిత స్థితి నిరంతర దురదృష్టాలకు కారణమవుతుందన్న విశ్వాసంతో ఆ కుటుంబం ఈ నిర్ణయానికి వచ్చింది.
ముప్పై ఏళ్ల క్రితం కుమార్తె మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. అప్పటి నుంచి వారికి ఊహించని సవాళ్లు ఎదురయ్యాయి.
పెద్దల మార్గదర్శకత్వం కోరగా, చనిపోయిన తమ కుమార్తె యొక్క అస్థిరమైన ఆత్మ వారి కష్టాలకు మూలం కావచ్చని వారు బదులిచ్చారు.
ఆమె ఆత్మకు శాంతి చేకూర్చడానికి కుటుంబం ఆమెకు వివాహం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది.
30 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తికి వరుడిని వెతకడానికి తల్లిదండ్రులు జిల్లాలో విస్తృతంగా చదివే ఓ వార్తాపత్రికలో ఒక ప్రకటన ప్రచురించారు.
'30 ఏళ్ల క్రితం కన్నుమూసిన వధువు కోసం వరుడిని వెతుకుతున్నాం' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రేమ మదువే (ఆత్మల వివాహం) ఏర్పాటు చేయడానికి దయచేసి ఈ నంబర్‌కు కాల్ చేయండి అంటూ వివరాలు ప్రచురించారు.
బంధువులు, స్నేహితులు ఎంత ప్రయత్నించినా ఒకే వయసు, కులానికి తగిన వరుడు దొరకడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రాంతంలో చనిపోయిన వ్యక్తులకు వివాహాలు జరిపించడం చాలా భావోద్వేగ ప్రాముఖ్యతను కలిగి ఉంది.
తుళువ జానపద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మరణించిన వారు వారి కుటుంబాలతో కనెక్ట్ అయి ఉంటారు. వారి సుఖదుఃఖాలలో భాగస్వామ్యం అవుతారు. ఫలితంగా 'వైకుంఠ సమరధనే', 'పిండ ప్రదానం' వంటి ఆచారాలకు స్వస్తి పలికి, మరణించిన ఆత్మలకు వివాహాలు జరిపిస్తారు.