Karnataka Covid cases: కర్ణాటకలో పెరుగుతున్న కొరోనా కేసులు; గత 24 గంటల్లో 225 శాతం పెరుగుదల
Karnataka Covid cases: కర్నాటకలో కోవిడ్ 19 కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దాంతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 175 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Karnataka Covid cases: కర్ణాటకలో కొత్త కోవిడ్ -19 కేసులు శుక్రవారం 225 శాతానికి పైగా పెరిగాయి. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో నమోదైన కొత్త కేసుల సంఖ్య 78 గా ఉంది. అలాగే, కొరోనా తో రాష్ట్రంలో మరో వ్యక్తి మరణించారు. దాంతో, రాష్ట్రంలో ఇప్పటివరకు కొరోనా (corona)తో చనిపోయిన వారి సంఖ్య 40,321కి చేరింది. ప్రస్తుతం, దేశంలో కేరళ తర్వాత అత్యధిక కేసులు నమోదైన రెండో రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. కొత్తగా జేఎన్ 1 వేరియంట్ ను గుర్తించిన తరువాత దేశవ్యాప్తంగా కొరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
కేసులు పెరుగుతున్నాయి
కొరోనా పాజిటివిటీ రేటు గురువారం 1.06 శాతం ఉండగా, అది శుక్రవారానికి 3.29 శాతానికి పెరిగింది . శుక్రవారం కొత్తగా నమోదైన కోవిడ్ -19 (covid 19) కేసుల్లో 68 కేసులు రాష్ట్ర రాజధాని బెంగళూరులోనే నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారం నమోదైన 105 కేసులతో పోలిస్తే కేవలం ఏడుగురు మాత్రమే కోలుకోవడంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 175కు పెరిగింది. బెంగళూరులో 156 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇతర జిల్లాలలో దక్షిణ కన్నడ జిల్లాలో రెండు, బెంగళూరు రూరల్ లో ఒకటి, చిక్కమగళూరులో నాలుగు, మైసూరులో ఒకటి, రామనగరలో రెండు కొత్త కేసులు నమోదయ్యాయి.
ఐసీయూల్లో ఆరుగురు
ప్రస్తుతం రాష్ట్రంలోని మొత్తం 175 యాక్టివ్ కేసుల్లో 162 మంది రోగులను ఇళ్లలోనే ఐసోలేషన్లో ఉంచారు. 13 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 13 మందిలో ఆరుగురు ఐసీయూల్లో ఉన్నారు. కర్ణాటకలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 40.89 లక్షలు కాగా, మరణాల రేటు 1.28 శాతంగా ఉంది.