Karnataka: ‘గృహలక్ష్మి’ పథకం ప్రారంభం.. ఇందులో లబ్ధిదారులుగా చేరడం ఎలా అంటే..?-karnataka cm siddaramaiah to launch gruha lakshmi scheme today details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Karnataka: Cm Siddaramaiah To Launch 'Gruha Lakshmi' Scheme Today. Details Here

Karnataka: ‘గృహలక్ష్మి’ పథకం ప్రారంభం.. ఇందులో లబ్ధిదారులుగా చేరడం ఎలా అంటే..?

HT Telugu Desk HT Telugu
Aug 30, 2023 12:14 PM IST

Karnataka: అసెంబ్లీ ఎన్నికల ప్రధాన హామీల్లో ఒకటైన గృహ లక్ష్మి పథకాన్ని కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం ప్రారంభించనుంది. మైసూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఈ స్కీమ్ ను ప్రారంభిస్తారు.

గృహ లక్ష్మి పథకానికి సంబంధించి పోస్టర్ ను విడుదల చేస్తున్న సీఎం సిద్ధరామయ్య (ఫైల్ ఫొటో)
గృహ లక్ష్మి పథకానికి సంబంధించి పోస్టర్ ను విడుదల చేస్తున్న సీఎం సిద్ధరామయ్య (ఫైల్ ఫొటో) (PTI)

Karnataka: అసెంబ్లీ ఎన్నికల ప్రధాన హామీల్లో ఒకటైన గృహ లక్ష్మి పథకాన్ని కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం ప్రారంభించనుంది. మైసూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఈ స్కీమ్ ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ, రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తదితరులు హాజరుకానున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఎన్నికల హామీ

ఈ పథకం కింద రాష్ట్రంలోని 1.1 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. ఈ పథకం ద్వారా కుటుంబ పెద్దగా ఉన్న మహిళ కు నెలకు రూ 2 వేల ను రాష్ట్ర ప్రభుత్వం సాయంగా అందిస్తుంది. ఈ పథకం కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎన్నికల హామీల్లో ఒకటి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఐదు ప్రధాన హామీలను ఇచ్చింది. అందులో గృహ లక్ష్మి పథకం కూడా ఒకటి. ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం.. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ మూడు ఎన్నికల హామీలను అమలు చేసింది. అవి ‘శక్తి’, ‘గృహజ్యోతి’, ‘అన్నభాగ్య’. ఇప్పుడు ‘గృహలక్ష్మి’ పథకాన్ని కూడా ప్రారంభిస్తోంది. అంటే మొత్తం ఐదు హామీలలో ఇప్పటివరకు నాలుగు హామీలను అమలు చేసింది. ఇక మిగిలింది ‘యువ నిధి’ పథకం మాత్రమే. ‘యువ నిధి’ పథకం కింద రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వనున్నారు.

రూ. 32 వేల కోట్లు..

గృహ లక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని 1.1 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. గృహ లక్ష్మి పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 32 వేల కోట్లను ఖర్చు చేయనుంది. అంత్యోదయ కార్డు, బిపిఎల్ కార్డు, ఏపీఎల్ కార్డు లో కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు ఈ పథకం కింద నెలకు 2000 అందిస్తారు. అయితే ఒక కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ ప్రయోజనం అందుతుంది. అలాగే, ఆ మహిళ ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆమెకు ఈ ప్రయోజనం లభించదు. ఆదాయ పన్ను చెల్లింపుదారులైన మహిళలకు, లేదా ఆ మహిళ భర్త ఆదాయపన్ను చెల్లింపుదారుడయితే, లేదా వారు జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నట్లయితే ఈ పథకం వారికి వర్తించదు.

ఇలా అప్లై చేయాలి..

ఈ పథకం కోసం కర్నాటక రాష్ట్రంలోని కుటుంబ పెద్దగా ఉన్న అందరు మహిళలు షరతులకు లోబడి అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో కానీ, ఆఫ్ లైన్ లో కానీ అప్లై చేసుకోవచ్చు. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి..

  • కుటుంబ పెద్దగా మహిళ ఉండాలి.
  • వారికి అంత్యోదయ కార్డు కానీ, దారిద్రరేఖ దిగువన ఉన్నట్లుగా తెలిపే బీపీఎల్ కార్డు గాని, దారిద్యరేఖ ఎగువన ఉన్నట్లుగా తెలిపే ఏపీఎల్ కార్డు గాని ఉండాలి.
  • వారి ఆధార్ కార్డు వారి బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉండాలి.
  • ఆధార్ తో లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉండాలి.
  • బ్యాంక్ ఖాతా వివరాలను తెలియజేయాలి.

తెలంగాణ ఎన్నికలసవివరమైన అప్‌డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు చదవండి. కీలక నియోజకవర్గాలు , కీలక అభ్యర్థులు , పార్టీ ప్రొఫైల్స్ ,  ఎగ్జిట్ పోల్స్, గత ఫలితాలు, లైవ్ టాలీ అన్నీ ఇక్కడ చూడొచ్చు.