నేడు కర్ణాటక బంద్! మహా నగరం బెంగళూరుతో పాటు అనేక ప్రాంతాల్లో బంద్ తీవ్రత కనిపించే అవకాశం ఉంది. ఉదయం 6 గంటలకు మొదలైన ఈ బంద్.. సాయంత్రం 6 గంటల వరకు, అంటే 12 గంటల పాటు కొనసాగుతుంది.
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) కండక్టర్ మరాఠీ మాట్లాడలేదనే కారణంతో ఆయనపై నెల రోజుల క్రితం బెళగావిలో దాడి జరిగింది. ఆ తర్వాత అది భాషపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. ఫలితంగా నేడు కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చారు.
అయితే సిద్ధరామయ్య నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బంద్‌కు మద్దతు ఇవ్వదని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ గురువారం ప్రకటించారు. ఇది సరైన చర్య కాదని వారికి (సంస్థలకు) అర్థమయ్యేలా చేస్తామని, ఇది ఇప్పటికే పరీక్షలు ప్రారంభమైన విద్యార్థులపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.
బెళగావి, రాష్ట్రంలోని ఇతర సున్నితమైన ప్రాంతాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించాలని భావిస్తున్నారు. కర్ణాటక బంద్ రోజువారీ దినచర్యపై ప్రభావం చూపుతుందని ప్రయాణికులు, వ్యాపార యజమానులు, విద్యార్థులను హెచ్చరించారు.
గత నెలలో బెళగావి నుంచి బాలేకుంద్రి వెళ్తున్న కేఎస్ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై మరాఠీ అనుకూల సంస్థలకు చెందిన వ్యక్తులు తమ భాష మాట్లాడలేదనే కారణంతో దాడి చేశారు.
ఈ ఘటనతో మహారాష్ట్ర- కర్ణాటక మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. కండక్టర్‌పై దాడితో రెండు రాష్ట్రాల మధ్య భాషా వివాదాల సుదీర్ఘ చరిత్రపై చర్చ మొదలైంది.
స్వాతంత్ర్యం అనంతరం మరాఠీ మాట్లాడే జనాభా గణనీయంగా ఉన్నందున ప్రస్తుతం కర్ణాటకలో భాగమైన బెళగావిని మహారాష్ట్ర తనదిగా పేర్కొంది. అప్పటి నుంచి రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో భాషా పోరాటాలు ఒక సమస్యగా ఉన్నాయి.
ఈ ప్రాంతంలో హింసను ప్రేరేపిస్తూ, మత సామరస్యానికి విఘాతం కలిగిస్తున్న మరాఠీ అనుకూల కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ "కన్నడ ఒక్కుట" అనే వివిధ కన్నడ అనుకూల సంస్థల కూటమి ఈ బంద్‌ను నిర్వహిస్తోంది. మరాఠీ అనుకూల సంస్థలను నిషేధించాలని వారు పిలుపునిచ్చారు.
బస్సు సర్వీసులు: కేఎస్ఆర్టీసీ, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) యూనియన్లు బంద్‌కు మద్దతు తెలిపాయి.
ఓలా, ఉబెర్: ఓలా, ఉబెర్ వంటి థర్డ్ పార్టీ ట్రాన్స్పోర్ట్ వెండర్లు, కొన్ని రిక్షా యూనియన్లు కూడా కర్ణాటక బంద్‌కు మద్దతు తెలిపాయి.
అయితే మెట్రో, రైల్వే, విమానాశ్రయ సేవలు నిరాటంకంగా కొనసాగుతాయి.
బ్యాంకులు: నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు ఎలాగో సెలవు ఉంటుంది. కొన్ని స్కూళ్లు, కాలేజీలకు ఈ రోజు సెలవులు ఉండవచ్చు కానీ ఇంకా అధికారిక ప్రకటనలు రాలేదు.
కన్నడ అనుకూల సంస్థలు తమను సంప్రదించడంతో రెస్టారెంట్లు, సినిమాహాళ్లు సహా వ్యాపార సంస్థలు సింబాలిక్ మద్దతు ప్రకటించాయి. అయితే అవి పనిచేస్తాయని తెలుస్తోంది.
ప్రభుత్వ కార్యాలయాలు: ప్రభుత్వ కార్యాలయాలు కూడా తెరిచి ఉంటాయి. ఆరోగ్య సంరక్షణ లేదా ఇతర అత్యవసర సేవలను అందించే అన్ని ప్రదేశాలు కూడా పనిచేస్తాయి.
సంబంధిత కథనం