Karnataka Assembly elections : జేడీఎస్​.. నాడు కింగ్​ మేకర్- నేడు ఉనికి కోసం పోరాటం!-karnataka assembly elections battle of survival for jd s or king maker again ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Karnataka Assembly Elections : జేడీఎస్​.. నాడు కింగ్​ మేకర్- నేడు ఉనికి కోసం పోరాటం!

Karnataka Assembly elections : జేడీఎస్​.. నాడు కింగ్​ మేకర్- నేడు ఉనికి కోసం పోరాటం!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 15, 2023 11:09 AM IST

Karnataka Assembly elections : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సన్నాహాలు చేసుకుంటోంది జేడీఎస్​. కానీ ఈ పార్టీ గెలుపు పక్కన పెడితే.. ఉనికి కోసం పోరాడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో జేడీఎస్​పై పొలిటికల్​ ఎనాలసిస్​ చుద్దాం..

కుమారస్వామికి అగ్నిపరీక్ష!
కుమారస్వామికి అగ్నిపరీక్ష! (HT_PRINT)

JDS Karnataka Assembly elections :జనతాదళ్​ సెక్యులర్​ (జేడీఎస్​).. కర్ణాటక రాజకీయాల్లో ఎప్పుడు సంచలనాలు జరిగినా వార్తల్లో నిలిచే పార్టీ ఇది! సొంతంగా ప్రభుత్వాన్ని స్థాపించలేకపోయినా.. అనేక సందర్భాల్లో 'కింగ్​ మేకర్​'గా ఆవిర్భవించి.. సీఎంతో పాటు ఇతర కీలక పదవులను వెనకేసుకుంది జేడీఎస్​. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. జేడీఎస్​ మరోమారు వార్తల్లో నిలుస్తోంది. ఈసారి మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తోంది. కింగ్​ మేకర్​ స్థాయి నుంచి పార్టీ ఉనికి కోసం పోరాటం చేసే స్థాయికి జేడీఎస్​ పడిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

నాడు కింగ్​ మేకర్​.. నేటి పరిస్థితేంటి?

2018 అసెంబ్లీ ఎన్నికల్లో 'కింగ్​ మేకర్​'గా ఆవిర్భవించి కర్ణాటకలో సంచలన పరిణామాలకు కేరాఫ్​ అడ్రస్​గా నిలిచింది జేడీఎస్​. బీజేపీ, కాంగ్రెస్​లు మెజారిటీ సాధించలేకపోవడంతో జేడీఎస్​ను అధికారం వరించింది. కాంగ్రెస్​తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. కర్ణాటక రాజకీయాల్లో తన శక్తిని చాటిచెప్పింది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రభుత్వం కూలడం, రాష్ట్రంలో బీజేపీకి మద్దతు పెరగడం, పార్టీలో అంతర్గత కలహాలు, వలసలతో జేడీఎస్​ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మరీ ముఖ్యంగా.. జేడీఎస్​ ఒక కుటుంబానికి చెందిన పార్టీ అని బీజేపీ చేసిన ప్రచారాలు మంచి ఫలితాల్ని ఇచ్చినట్టు కనిపిస్తోంది. వారసత్వ రాజకీయాలు చేస్తోందనే మచ్చ ఆ పార్టీపై పడింది. జేడీఎస్​ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని దేవెగౌడ్​ వయస్సు రిత్యా రాజకీయాలకు దూరంగా ఉండటం కూడా పార్టీకి ఒకింత నష్టం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన కుమారుడు హెచ్​డీ కుమారస్వామి ఒక్కరే.. పార్టీ బాధ్యతలను తన భుజాల మీద మోసుకుని నడిపిస్తున్నారు.

JDS Karnataka news : 1999లో జేడీఎస్​ను స్థాపించారు దేవెగౌడ. అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఈ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. రెండుసార్లు సంకీర్ణ ప్రభుత్వాలను నడిపింది. 2006 ఫిబ్రవరిలో బీజేపీతో కలిసి 20 నెలల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2018 మేలో కాంగ్రెస్​తో కలిసి 14 నెలలపాటు అధికారంలో నిలిచింది. ఈ రెండు సందర్భాల్లోనూ కుమారస్వామి సీఎంగా నిలిచారు.

ఈసారి మాత్రం.. చరిత్రను తిరగరాయాలన్న దృఢసంకల్పంలో ఉంది జేడీఎస్​. రాష్ట్రంలో స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 'మిషన్​ 123' అనే పేరుతో పార్టీలో ఉద్యమం చేపట్టింది. త్వరలో 224 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో.. 123 సీట్లల్లో గెలిచి, ప్రభుత్వాన్ని స్థాపించాలన్నదే ఈ మిషన్​ లక్ష్యం. ఇందుకోసం ప్రాంతీయ వాదాన్ని అస్త్రంగా ఉపయోగిస్తోంది. 'కన్నడ ప్రజల గౌరవం' అంటూ విపరీతంగా ప్రచారాలు చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న ఒకైక కన్నడిగ పార్టీ తమదేనని.. జేడీఎస్​ను గెలిపిస్తే కర్ణాటకను గెలిపించినట్టేనని ప్రజల్లోకి వెళుతోంది.

మిషన్​ సక్సెస్​ అవుతుందా?

2023 Karnataka assembly elections : కానీ ఈ మిషన్​ సక్సెస్​ అవుతుందా? అని ఇటు సొంత పార్టీ సభ్యుల్లో, అటు రాజకీయ విశ్లేషకుల్లో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గత రికార్డులను చూస్తే.. కర్ణాటక ఎన్నికల్లో.. జేడీయూ ది బెస్ట్​ పర్ఫార్మెన్స్​ చేసి దాదాపు రెండు దశాబ్దాలు గడిచిపోయింది! 2004 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో.. 58 సీట్లు గెలిచింది ఈ పార్టీ. ఇదే జేడీఎస్​కు అత్యధికం. 2013లో 40 సీట్లు వెనకేసుకుంది. ఇక 2018 ఎన్నికల్లో 37 సీట్లతో కింగ్​ మేకర్​గా అవతరించింది.

ఇది ఇలా ఉండగా.. పార్టీపై ఓ వర్గం నేతలు మాత్రం ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేసి.. 'రాజకీయాల'తో ప్రభుత్వ స్థాపనలో కీలక పాత్ర పోషించాలని వారు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఇందుకోసం.. గతంలో కన్నా ఇంకొన్ని సీట్లు ఎక్కువ గెలిస్తే సరిపోతుందని వీరు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

JDS vs BJP in Karnataka : "మళ్లీ కింగ్​ మేకర్​ పరిస్థితి ఏర్పడితే.. కుమారస్వామిని సీఎం చేయాలని డిమాండ్​ చేస్తాము. కానీ గత అనుభవాలు మాకు గుర్తున్నాయి. ఈసారి జాగ్రత్తపడతాము," అని ఓ జేడీఎస్​ నేత పేర్కొన్నారు.

ఓటు బ్యాంకు తగ్గుతుంటే.. గెలుపేలా?

జేడీఎస్​ నేతల ఆశలు భారీగా ఉన్నా.. ఎన్నికల్లో ఆ పార్టీ ఓటు బ్యాంకు మాత్రం పతనవుతూనే ఉంది! కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ బలమైన పట్టు ఉండటంతో.. మొత్తం మీద జేడీఎస్​కు 18-20శాతం ఓట్ల షేరు లభిస్తోంది. ముఖ్యంగా పాత మైసూర్​ ప్రాంతంలో వొక్కలిగ బెల్ట్​లో చాలా మంది ఇప్పటికీ జేడీఎస్​వైపే ఉండటం పార్టీకి ఊరటనిచ్చే విషయం. ఈ ప్రాంతంలోని 61 సీట్లల్లో జేడీఎస్​ ప్రభావం ఉంది.

JDS Kumaraswamy latest news : అయితే ఈ సీట్లపై కన్నేసిన బీజేపీ, కాంగ్రెస్​లు.. ఓటు బ్యాంకును పెంచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తుండటం.. జేడీఎస్​కు ఆందోళన కలిగించే విషయమే. ముఖ్యంగా పాత మైసూరు ప్రాంతంలో జేడీఎస్​కు కాంగ్రెస్​ నుంచి అనాదిగా గట్టిపోటీ ఎదురవుతోంది. ఇక్కడ బీజేపీకి పెద్దగా మద్దతు లేదు. అందుకే ఈ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పార్టీ కార్యకర్తలు, నేతలకు ఇప్పటికే ఆదేశాలిచ్చారు కేంద్ర మంత్రి అమిత్​ షా.

"అభ్యర్థుల లిస్ట్​ బయటకొచ్చిన తర్వాత.. జేడీఎస్​ ఎంత బలంగా ఉందనేది తెలుస్తుంది. ఇతర పార్టీల్లో బలమైన నేతలు.. అసంతృప్తితో జేడీఎస్​లో చేరితే మంచిదే. దీని వల్ల జేడీఎస్​కు మంచి జరుగుతుంది. సీట్ల సంఖ్యతో పాటు ఓట్ల శాతం కూడా పెరుగుతుంది," అని అభిప్రాయపడ్డారు అజీమ్​ ప్రేమ్​జీ వర్సిటీకి చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఏ నారాయణ్​. 2018తో పోల్చుకుంటే ఓల్డ్​ మైసూర్​లో జేడీఎస్​ ఎంత బలంగా ఉందనేది కూడా ఈసారి కీలకంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ఈ ప్రాంతంలో కూడా జేడీఎస్​కు ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నట్టు వివరించారు. నేతల వలసలు, ఒక్కలిగుల్లో కాంగ్రెస్​ పెరుగుతున్న మద్దతు ఇందుకు కారణం అన్నారు.

జేడీఎస్​.. కుటుంబ పార్టీనేనా?

Deve Gowda family in politics : కుటుంబ రాజకీయలపై యుద్ధం చేస్తూ ఇప్పటికే ఎన్నో ఎన్నికలు గెలిచింది బీజేపీ. ఇక అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ ఈ అస్త్రాన్ని ఉపయోగించే అవకాశం లేకపోలేదు. గౌడ కుటుంబానికి చెందిన 8మంది ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండటం ఇందుకు కారణం. దేవె గౌడ్​ రాజ్యసభ సభ్యుడు. ఆయన కుమారుడు కుమారస్వామి ఓ మాజీ సీఎం, ప్రస్తుతం చెన్నపట్న ఎమ్మెల్యే. కుమారస్వామి భార్య అనిత.. రామనగర ఎమ్మెల్యే. ఆయన కుమారుడు నిఖిల్​.. జేడీఎస్​ యూత్​ వింగ్​ అధ్యక్షుడు. 2019 లోక్​సభ ఎన్నికల్లో మాండ్య నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దేవె గౌడ పెద్ద కుమారుడు హెచ్​డీ రేవన్న ఓ మాజీ మంత్రి, ప్రస్తుతం హోలెనరసింపుర ఎమ్మెల్యే. ఆయన భార్య భవానీ రేవన్న.. హసన్​ జిల్లా పరిషత్​ సభ్యురాలు. వారి కుమారులు ప్రజ్వల్​, సురజ్​ల్లో ఒకరు హసన్​ ఎంపీ, ఇంకొకరు హసన్​ ఎమ్మెల్సీ. ఈ విధంగా.. లోక్​సభ, రాజ్యసభ, అసెంబ్లీ, శాసన మండలిలో దేవె గౌడ కుటుంబానికి ప్రాతినిథ్యం ఉండటం గమనార్హం.

కుటుంబం మొత్తం రాజకీయాల్లో ఉండటం కూడా పార్టీకి చేటుచేస్తోందన్న వాదనలు ఉన్నాయి. పార్టీ అంత కుటుంబ రాజకీయాల చుట్టే తిరుగుతోందన్నది రాజకీయ విశ్లేషకుల మాట.

Karnataka assembly elections survey : 224 అసెంబ్లీ స్థానాలకు ఈ ఏడాది మేలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో.. జేడీఎస్​ను ప్రజలు గెలిపించి ప్రభుత్వాన్ని కట్టబెడతారా? ఈ పార్టీ మళ్లీ కింగ్​ మేకర్​గా ఆవిర్భవిస్తుందా? లేక గతంలో కన్నా దారుణమైన ప్రదర్శన చేసి చతికిలపడుతుందా? అన్న ప్రశ్నలకు ఓటర్లే సమాధానం చెప్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం