Free bus scheme : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం- కానీ టికెట్ ఛార్జీలు మాత్రం భారీగా పెంపు..!
Karnataka free bus scheme : కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు, బస్సు టికెట్ ఛార్జీలను భారీగా పెంచేందుకు ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం పథకంతో చితికిపోతున్న కేఎస్ఆర్టీసీ (కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్)కి భారీ ఊరట! బస్సు టికెట్ ధరలను 15శాతం పెంచేందుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. కేఎస్ఆర్టీసీతో పాటు కళ్యాన కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (కేకేఆర్టీసీ), నార్త్ వెస్టర్న్ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్డబ్ల్యూకేఆర్టీసీ), బెంగళూరు మెట్రోపాలిటిన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ)కి సైతం ఇది వర్తిస్తుంది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ- కానీ టికెట్ ఛార్జీలు పెంపు..!
తాజాగా పెంచిన బస్సు టికెట్ ఛార్జీలు జనవరి 5న అమల్లోకి వస్తాయి. తాజా పెంపుతో కార్పొరేషన్స్‌కి రోజుకు అదనంగా రూ. 7.84 కోట్ల వరకు ఆదాయం పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి. ఉచిత బస్సు పథకం కారణంగా డబ్బులు కొరతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కర్ణాటక బస్సు సర్వీసులకు ఇది ఊరటనిచ్చే విషయం.
2023లో ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే శక్తి స్కీమ్‌ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే! కర్ణాటకలో ఇది భారీ విజయాన్ని చూసింది. ఫలితంగా తెలంగాణలోనూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో దీనికి ఆదరణ లభించింది. అనంతరం కాంగ్రెస్ కూడా తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టింది.
అయితే మహిళలకు ఉచిత బస్సు పథకం కారణంగా కర్ణాటక ప్రభుత్వం ప్రతి నెల సుమారు రూ. 420 కోట్ల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రతి కార్పొరేషన్‌కి రూ. 104 కోట్ల వరకు ఇస్తోంది. తాజాగా 15శాతం టికెట్ ధరల పెంపుతో ఆర్థిక భారం కొంతమేర తగ్గనుంది.
వాస్తవానికి కర్ణాటకలో గడిచిన దశాబ్ద కాలంలో బస్సు టికెట్ ధరలను పెద్దగా సవరించలేదు. 2014లో లీటర్ డీజిల్ ధర రూ. 30గా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు రూ.95 దాటేంత వరకు బీఎంటీసీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. కేఎస్ఆర్టీసీ, కేకేఆర్టీసీ, ఎన్డబ్ల్యూఆర్టీసీ మాత్రం 2020లో టికెట్ ఛార్జీలను కాస్త పెంచాయి.
బీజేపీ సీరియస్..
అయితే, కర్ణాటకలో బస్సు టికెట్ ధరలను పెంచడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసిది.
"ఉచిత పథకాలతో ప్రజలపై పరోక్షంగా భారాన్ని వేస్తున్నారు. ఇది బై వన్ గెడ్ వన్ ఫ్రీ మార్కెటింగ్ గిమ్మిక్గా మారింది," అని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర మండిపడ్డారు.
"రోజూ ఏదో ఒక ధర పెంచి కన్నడ ప్రజల రక్తాన్ని తాగుతోంది ఈ ప్రభుత్వం. ప్రభుత్వ దురాశల కోసం కన్నడ ప్రజలు ఇంకెన్ని ట్యాక్స్‌లు, ఛార్జీలు కట్టాలి?" అని మరో బీజేపీ నేత ఆర్ అశోక్ ప్రశ్నించారు.
సంబంధిత కథనం