రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ-అనుబంధ పాఠశాలలకు 10 రోజుల సెలవు ప్రకటించారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న సామాజిక, విద్యా సర్వే (ప్రజల్లో ‘కుల సర్వే’గా సుపరిచితం)లో నిమగ్నమైన ఉపాధ్యాయులు ఆ పనిని పూర్తి చేసేందుకు వీలుగా అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 18 వరకు స్కూల్స్‌కి సెలవు ఇచ్చారు.
కర్ణాటక కుల సర్వే పని అక్టోబర్ 18 నాటికి, అంటే మరో 10 రోజుల్లో (ఎనిమిది పనిదినాలు) పూర్తి అవుతుందని సిద్ధరామయ్య తెలిపారు. అయితే, మధ్యంతర పరీక్షలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు మాత్రం ఈ సర్వే విధుల్లో నుంచి మినహాయింపునిచ్చారు.
వాస్తవానికి ఈ సర్వే పని మంగళవారంతో ముగియాల్సి ఉంది. అయితే, చాలా జిల్లాల్లో పని అనుకున్నంత వేగంగా పూర్తి కాకపోవడంతో, ముఖ్యమంత్రి తన కేబినెట్ సహచరులతో కలిసి సెలవులను మరో 10 రోజులు పొడిగించాలని నిర్ణయించారు.
"మేము అక్టోబర్ 7 నాటికి (సర్వే పని) ముగించాలనుకున్నాం. కానీ కొన్ని జిల్లాల్లో సర్వే దాదాపు పూర్తయింది, మరికొన్ని జిల్లాల్లో వెనుకపడింది," అని మంత్రులు, అధికారులతో సమావేశం తర్వాత ముఖ్యమంత్రి విలేకరులకు వివరించారు.
"ఉదాహరణకు, కర్ణాటకలోని కొప్పళ జిల్లాలో 97 శాతం సర్వే పూర్తయింది. ఉడుపిలో 63 శాతం, దక్షిణ కన్నడ జిల్లాల్లో 60 శాతం సర్వే పూర్తయింది. మొత్తంగా రాష్ట్రంలో మేము ఆశించిన విధంగా సర్వే పూర్తి కాలేదు," అని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు సర్వే పనిలో ఉండగా మరణించిన ముగ్గురు సిబ్బంది కుటుంబాలకు ముఖ్యమంత్రి రూ. 20 లక్షల చొప్పున పరిహారాన్ని కూడా ప్రకటించారు.
పలు నివేదికల ప్రకారం.. ఈ సర్వేలో దాదాపు 1.75 లక్షల మంది ఎన్యుమరేటర్స్ పాల్గొంటున్నారు. వీరిలో అత్యధికులు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులే. వీరు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 కోట్ల కుటుంబాలలో సుమారు 7 కోట్ల మంది ప్రజలను కవర్ చేస్తున్నారు.
అధికారుల సమాచారం మేరకు, సుమారు రూ. 420 కోట్లు అంచనా వేసిన ఈ సర్వేను, ఇందుకోసం తయారుచేసిన 60 ప్రశ్నల ప్రశ్నాపత్రంతో "శాస్త్రీయంగా" నిర్వహిస్తున్నారు. ఈ సర్వే నివేదికను కమిషన్ డిసెంబర్ నెలాఖరులోగా ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది.
ప్రతి ఇంటికి విద్యుత్ మీటర్ నంబర్‌ను ఉపయోగించి జియో-ట్యాగింగ్ చేస్తారు. ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేక గృహ ఐడీ కేటాయిస్తారు.
సమాచార సేకరణ సమయంలో రేషన్ కార్డులు, ఆధార్ వివరాలను మొబైల్ నంబర్‌లకు లింక్ చేస్తారు. సర్వే సమయంలో ఇంట్లో లేని వారి కోసం, ఏవైనా ఫిర్యాదులు ఉంటే వాటిని పరిష్కరించడానికి 8050770004 నంబర్‌తో ఒక ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు. పౌరులు ఆన్‌లైన్‌లో కూడా ఈ సర్వేలో పాల్గొనవచ్చు అని అధికారులు తెలిపారు.
సంబంధిత కథనం