IndiGo, SpiceJet: గల్ఫ్ వెళ్లే ఇండిగో, స్పైస్ జెట్ ల ఎమర్జెన్సీ ల్యాండింగ్
కేరళ లోని కన్నూర్ నుంచి ఖతార్ లోని దోహాకు వెళ్లే ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో, ఆ విమానాన్ని అర్థాంతరంగా ముంబైలో ల్యాండ్ చేశారు.
శుక్రవారం ఖతార్ లోని దోహాకు కేరళలోని కన్నూర్ నుంచి వెళ్తున్న ఇండిగో విమానానికి (IndiGo flight - 6E-1715) ముప్పు తప్పింది. విమానం టేకాఫ్ అయిన తరువాత విమానంలో సాంకేతిక సమస్యను సిబ్బంది గుర్తించారు.
IndiGo diverted to Mumbai: ముంబైకి తరలింపు
విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించడంతో, విమానాన్ని వెంటనే ముంబై కి మళ్లించారు. ఏటీసీ నుంచి అవసరమైన అనుమతులు పొందిన తరువాత ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. అవసరమైన మరమ్మత్తులు కొనసాగుతున్నాయని ఇండిగో ప్రకటించింది. ప్రయాణీకులకు మరో ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసి, పంపించామని వెల్లడించింది.
SpiceJet emergency landing: స్పైస్ జెట్ కూడా..
మరోవైపు, కేరళలోని కోజికోడ్ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్తున్న స్పైస్ జెట్(SpiceJet) విమానంలో కూడా సమస్య తలెత్తడంతో శుక్రవారం సాయంత్రం ఆ విమానాన్ని కొచ్చిన్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ విమానంలో ఆరుగురు సిబ్బంది సహా 197 మంది ప్రయాణీకులున్నారు. విమానంలోని హైడ్రాలిక్ వ్యవస్థలో సమస్య తలెత్తినట్లు గుర్తించారు. స్పైస్ జెట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి రావడంతో శుక్రవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో కొచ్చిన్ ఏర్ పోర్ట్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు. మిగతా విమానాల ప్రయాణ సమయాలను మార్చారు. అనంతరం సాయంత్రం 07.20 గంటల సమయంలో స్పైస్ జెట్ విమానం సేఫ్ గా ల్యాండ్ అయింది.