అమెరికన్ రాపర్, రికార్డు ఎగ్జిక్యూటివ్‌గా పేరుగాంచిన సీన్ ‘డిడ్డీ’ కాంబ్స్‌కు 50 నెలల జైలు శిక్ష ఖరారైంది. మహిళలపై హింస, రాకెటీరింగ్, సెక్స్ ట్రాఫికింగ్‌తో పాటు పలు నేరాలకు సంబంధించి యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి అరుణ్ సుబ్రమణియన్ ఈ తీర్పు ఇచ్చారు.
ప్రస్తుతం అపఖ్యాతి పాలైన ఈ హిప్‌హాప్ దిగ్గజానికి శిక్షను ఖరారు చేస్తూ, జడ్జి సుబ్రమణియన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంబ్స్ మాజీ ప్రేమికురాళ్లు, రిథమ్ అండ్ బ్లూస్ గాయని కసాండ్రా వెంట్యురా, కోర్టులో 'జేన్' అనే మారుపేరుతో పిలవబడిన మరో మహిళ చేసిన ఆరోపణలను న్యాయమూర్తి ప్రస్తావించారు.
“ఇక్కడ జరిగింది కేవలం ఇద్దరి మధ్య అంగీకారంతో కూడిన అనుభవాలు లేదా 'సెక్స్, డ్రగ్స్, రాక్-అండ్-రోల్' కథ మాత్రమేనని నిందితుడి తరపు న్యాయవాదులు చెప్పే ప్రయత్నాన్ని కోర్టు తిరస్కరిస్తోంది,” అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. “ఇది లొంగదీసుకోవడం. ఇది మిస్ వెంట్యురాను, జేన్‌ను ఆత్మహత్యకు ప్రయత్నించే ఆలోచనల వరకు తీసుకెళ్లింది,” అని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
కాంబ్స్ తమను పురుష ఎస్కార్ట్‌లతో లైంగిక చర్యల్లో పాల్గొనమని బలవంతం చేశాడని, వాటిని అతడు చిత్రీకరించి, స్వయంగా ఆనందించేవాడని ఆ మహిళలు ఆరోపించారు.
అరుణ్ సుబ్రమణియన్ అమెరికాలో జన్మించిన భారతీయ మూలాలు ఉన్న న్యాయమూర్తి. ఆయన సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జిగా పనిచేస్తున్నారు.
సుబ్రమణియన్‌ను 2023 మార్చిలో అప్పటి యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ ఈ పదవికి నామినేట్ చేశారు.
ఆయన ఈ ఫెడరల్ బెంచ్‌లో పనిచేసిన మొట్టమొదటి దక్షిణ ఆసియా మూలాలున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.
సుబ్రమణియన్ నియామకాన్ని ధృవీకరించే సమయంలో అప్పటి యూఎస్ సెనేట్ మెజారిటీ నాయకుడు చక్ షూమర్ మాట్లాడుతూ, “మిస్టర్ సుబ్రమణియన్ రెజ్యూమె ఒక స్పష్టమైన విషయాన్ని చెబుతోంది: ఆయన అద్భుతమైన వ్యక్తి, గొప్ప విజయాలు సాధించారు. సగటు అమెరికన్ల కోసం పోరాడటానికి తన కెరీర్‌ను అంకితం చేశారు,” అని కొనియాడారు. “అన్యాయమైన, చట్టవిరుద్ధమైన పద్ధతుల ద్వారా గాయపడిన వారిని రక్షించడంలో ఆయనకు సంవత్సరాల అనుభవం ఉంది. అంతేకాక, చైల్డ్ ట్రాఫికింగ్ బాధితుల తరపున కూడా ఆయన పోరాడారు,” అని షూమర్ మరింతగా తెలిపారు.
పుట్టుక: సుబ్రమణియన్ 1979లో పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో జన్మించారు.
తల్లిదండ్రులు: ఆయన తల్లిదండ్రులు 1970ల ప్రారంభంలో భారతదేశం నుంచి అమెరికాకు వలస వెళ్లారు. తండ్రి కంట్రోల్ సిస్టమ్స్ ఇంజనీర్‌గా, తల్లి బుక్‌కీపర్‌గా పనిచేశారని ఒక నివేదిక వెల్లడించింది.
విద్య: కేస్ వెస్ట్రన్ యూనివర్శిటీ నుంచి అండర్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందారు సుబ్రమణియన్.
కొలంబియా లా స్కూల్ నుంచి 2004లో జ్యూరీస్ డాక్టర్ డిగ్రీని అందుకున్నారు.
లా క్లర్క్‌గా: 2004-2005: యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ (సెకండ్ సర్క్యూట్)లో డెన్నిస్ జాకబ్స్ వద్ద సేవలు అందించారు.
2005-2006: సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో గెరార్డ్ ఇ. లించ్ వద్ద సేవలు అందించారు.
2006-2007: యూఎస్ సుప్రీంకోర్టులో దివంగత జస్టిస్ రూత్ బాడర్ గిన్స్‌బర్గ్ వద్ద సేవలు అందించారు.
లా ఫర్మ్‌లో భాగస్వామి: 2007 నుంచి 2023 వరకు న్యూయార్క్ సిటీలోని సుస్మాన్ గాడ్ఫ్రే ఎల్‌ఎల్‌పీ అనే ప్రముఖ న్యాయ సంస్థలో పనిచేశారు. ఇక్కడ ఆయన ప్రధానంగా వాణిజ్య, దివాలా చట్టాలపై దృష్టి సారించారు.
సంబంధిత కథనం