J-K Polls: ఒమర్ అబ్దుల్లా యూ టర్న్; అసెంబ్లీ ఎన్నికలపై కీలక నిర్ణయం
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సంబంధించినేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా యూ టర్న్ తీసుకున్నారు. ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనబోనని గతంలో ఇచ్చిన మాటను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గండేర్బల్ నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనబోనని గతంలో ఇచ్చిన మాటను వెనక్కు తీసుకుంటూ.. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కశ్మీర్ లోయలోని గండేర్బల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
గతంలో ఏమన్నారంటే..
జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించే వరకు ఎన్నికలకు దూరంగా ఉండాలని గతంలో ఒమర్ అబ్దుల్లా నిర్ణయించుకున్నారు. ఆ మేరకు బహిరంగంగా ఒక ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు, తాజాగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. అయితే, ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో కూడా ఒమర్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బారాముల్లా జిల్లాలో జైలులో ఉన్న ఇంజనీర్ రషీద్ చేతిలో ఒమర్ అబ్దుల్లా ఓడిపోయారు.
సెప్టెంబర్ 18 నుంచి..
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు సెప్టెంబర్ 18 నుంచి మూడు దశల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీకి నాయకత్వం వహిస్తానని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా ఆగస్టు 16న ప్రకటించారు. కశ్మీర్ లోయలో నేషనల్ కాన్ఫరెన్స్ కు బలమైన పట్టు ఉన్న ప్రాంతాల్లో గండేర్ బల్ కూడా ఒకటి. 1977లో నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు షేక్ మహమ్మద్ అబ్దుల్లా, 1983, 1987, 1996లో ఆయన కుమారుడు ఫరూక్ అబ్దుల్లా, 2008లో ఒమర్ అబ్దుల్లా ఈ నియోజకవర్గం నుంచే ఎన్నికయ్యారు. ఎన్సీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009 నుంచి 2014 వరకు ప్రాతినిధ్యం వహించిన గండేర్ బల్ అసెంబ్లీ స్థానానికి ఒమర్ అబ్దుల్లా సహా, మొత్తం 32 మంది అభ్యర్థుల జాబితాను ఎన్సీ మంగళవారం విడుదల చేసింది.
ఎన్సీ, కాంగ్రెస్ పొత్తు
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కుదుర్చుకున్న పొత్తులో భాగంగా నేషనల్ కాన్ఫరెన్స్ 51, కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించాయి. ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న తన నిర్ణయాన్ని పునఃసమీక్షించే అవకాశం ఉందని ఒమర్ అబ్దుల్లా సోమవారమే సంకేతాలు ఇచ్చారు. ఎన్సీ, కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు ప్రకటన వెలువడిన తర్వాత ఒమర్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ, తాను పోటీ చేయకుండా, పార్టీ తరఫున ఇతర సభ్యులను పోటీ చేయించడం ద్వారా తప్పుడు సంకేతాలు పంపుతున్నట్లు అవుతుందని తాను భావిస్తున్నాన్నారు. ‘‘నేను అసెంబ్లీకి పోటీ చేయడానికి సిద్ధంగా లేనప్పుడు, ఆ అసెంబ్లీకి ఓటు వేయడానికి ప్రజలను ఎలా సిద్ధం చేయగలను?’’ అని అబ్దుల్లా (Omar Abdullah) అన్నారు.