Jharkhand polls: జార్ఖండ్ ఎన్నికల్లో ‘ఇండియా కూటమి’ సీట్ల పంపకం పూర్తి; 3 సీట్లలో ఫ్రెండ్లీ ఫైట్
Jharkhand polls: జార్ఖండ్ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కాంగ్రెస్, జేఎంఎం ఇప్పటికే ప్రకటించాయి. ఆ మేరకు కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకానికి సంబంధించిన ఒప్పందం కుదిరింది.43 సీట్లలో జేఎంఎం, 30 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. మూడు అసెంబ్లీ స్థానాల్లో ఫ్రెండ్లీ ఫైట్ జరగనుంది.
Jharkhand polls: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జేఎంఎం సహా ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే, మూడు అసెంబ్లీ స్థానాల్లో మాత్రం స్నేహపూర్వక పోటీ నెలకొన్నది. ధన్వార్ అసెంబ్లీ స్థానంలో స్నేహపూర్వక పోటీకి వెళ్లాలని జేఎంఎం, సీపీఐ-ఎంఎల్ ఇప్పటికే నిర్ణయించగా, ఛత్తర్పూర్, బిష్రాంపూర్ స్థానాల్లో స్నేహపూర్వక పోటీని నివారించడానికి కాంగ్రెస్, ఆర్జేడీలు ప్రయత్నిస్తున్నాయి.
మొత్తం 81 సీట్లు.
81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రెండు దశల ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ కసరత్తు పూర్తయిన తర్వాత 81 అసెంబ్లీ స్థానాలకు 1,211 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సీపీఐ ఎంఎల్ 4 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి.
మూడు సీట్లలో పీటముడి
జార్ఖండ్ ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ-ఎంఎల్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మూడు స్థానాలు (ఛత్తర్ పూర్, బిష్రాంపూర్, ధన్వార్) మినహా కూటమిలోని అన్ని నియోజకవర్గాలకు సీట్ల పంపకాలు ఖరారయ్యాయి. ధన్వార్ నియోజకవర్గంలో సీపీఐ-ఎంఎల్తో స్నేహపూర్వక పోటీకి వెళ్లాలని జేఎంఎం నిర్ణయించింది' అని జేఎంఎం ప్రధాన కార్యదర్శి వినోద్ పాండే విలేకరులకు తెలిపారు. ఛతర్పూర్, బిష్రాంపూర్ స్థానాల్లో ఆర్జేడీ, కాంగ్రెస్ తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. ‘రెండు స్థానాలపై సమస్య పరిష్కారానికి ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం' అని పాండే తెలిపాడు. కాగా, తమ సీట్ల పంపకాలను బీజేపీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.