జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా, బుద్గామ్ జిల్లాల పరిధిలో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారు. వీరిలో జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థకు చెందిన కమాండర్ జహీద్ వనీ, పాకిస్తాన్‌కు చెందిన ఒక తీవ్రవాది కూడా ఉన్నారు. 12 గంటల వ్యవధిలో జరిగిన ఈరెండు ఎన్‌కౌంటర్లలో హతమైన వారు వేర్వేరు తీవ్రవాద సంస్థలకు చెందినవారు ఉన్నారు. కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ ఆదివారం ఉదయం ఈ వివరాలు వెల్లడించారు.
‘లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థలతో సంబంధం ఉన్న ఐదుగురు పాకిస్తాన్ ప్రాయోజిత తీవ్రవాదులు రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. జైషే మహమ్మద్ కమాండర్ జహీద్ వనీ సహా ఓ పాకిస్తాన్ తీవ్రవాది కూడా హతమయ్యారు..’ అని సంబంధిత యంత్రాంగం తెలిపింది.
పోలీసులకు ఉన్న సమాచారం ప్రకారం పుల్వామా జిల్లా నైరా ప్రాంతంలో సాయుధ బలగాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు తీవ్రవాదులు హతమయ్యారు.
ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తీవ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని కశ్మీర్ జోన్ పోలీస్ విభాగం ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఇక బుద్గామ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక తీవ్రవాది హతమయ్యాడు. ఈ తీవ్రవాది నుంచి ఏకే-56 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు సాయుధ బలగాలు తెలిపాయి.