Jammu Kashmir Election 2024 : ఉగ్రదాడుల జిల్లాల్లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. 26 సీట్లు, 239 అభ్యర్థులు
Jammu Kashmir Assembly Election 2024 : జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో ఆరు జిల్లాల్లోని 26 స్థానాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది. కీలక అభ్యర్థుల్లో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఉన్నారు. ఉగ్రదాడులు ఎక్కువగా జరిగిన ప్రదేశాలు కావడంతో భద్రత కట్టుదిట్టం చేశారు.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ సెప్టెంబర్ 25న 6 జిల్లాల్లోని 26 స్థానాల్లో జరగుతోంది. మొత్తంమీద 2.5 మిలియన్ల మంది ఓటర్లు ఈ జిల్లాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అర్హులు. కాశ్మీర్ లోయలో మూడు జిల్లాలు, జమ్మూ డివిజన్‌లో మూడు జిల్లాలు రెండో దశ పోలింగ్‌లో ఉన్నాయి.
26 నియోజకవర్గాలు
26 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ లిస్టులో కంగన్ (ఎస్టీ), గందర్‌బాల్, హజ్రత్‌బాల్, ఖన్యార్, హబ్బాకదల్, లాల్ చౌక్, చన్నపోరా, జదిబాల్, ఈద్గా, సెంట్రల్ షాల్తెంగ్, బుద్గామ్, బీర్వా, ఖాన్‌సాహిబ్, చ్రార్-ఇ-షరీఫ్, చదూరా, గులాబ్‌ఘర్ (ST), రియాసి, శ్రీ మాతా వైష్ణో దేవి, కలకోటే - సుందర్‌బని, నౌషేరా, రాజౌరి (ST), బుధాల్ (ST), తన్నమండి (ST), సురంకోట్ (ST), పూంచ్ హవేలీ అండ్ మెంధర్ (ST) ఉన్నాయి.
సెంట్రల్ కాశ్మీర్‌లోని గందర్‌బాల్, శ్రీనగర్, బుద్గామ్. జమ్మూ డివిజన్‌లోని రియాసి , రాజౌరి, పూంచ్ జిల్లాలకు ఓటింగ్ జరుగుతోంది. ఈరోజు ఓటింగ్ జరుగుతున్న మూడు జమ్మూ జిల్లాల్లో ఇటీవలి కాలంలో ఉగ్రదాడులు జరిగాయి.
239 అభ్యర్థులు
రెండో విడత పోలింగ్‌తో 239 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. వీరిలో శ్రీనగర్ జిల్లాలో 93 మంది అభ్యర్థులు, బుద్గామ్‌లో 46 మంది, రాజౌరిలో 34 మంది, పూంచ్‌లో 25 మంది , గందర్‌బల్‌లో 21 మంది, రియాసిలో 20 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
తాజా జాబితా ప్రకారం 13,12,730 మంది పురుషులు, 12,65,316 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ దశలో 25,78,099 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గతంలో ఉగ్రదాడులు
రెండో విడత ఓటింగ్ జరిగే ప్రాంతంలో గతంలో ఉగ్రదాడులు జరిగాయి. దీంతో మొత్తం ఆరు జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా రియాసి, రాజౌరి, పూంచ్ గత మూడేళ్లలో బ్యాక్ టు బ్యాక్ టెర్రర్ దాడులతో దెబ్బతిన్నాయి.
సెప్టెంబర్ 18న జరిగిన తొలి దశ ఎన్నికల్లో 61 శాతం ఓటింగ్ నమోదైంది. జమ్మూ కాశ్మీర్‌లో ఆరేళ్లపాటు కేంద్ర పాలన తర్వాత ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు దశాబ్ద కాలంలో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు. అక్టోబర్ 1న చివరి దశ పోలింగ్ జరగనుండగా.. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.