Jallikattu: మొదలైన జల్లికట్టు సీజన్.. తొలిరోజే చిందిన రక్తం!
Jallikattu season begins in Tamil Nadu: తమిళనాడులో ఈ ఏడాది జల్లికట్టు సీజన్ ప్రారంభమైంది. తొలిరోజు పడుకొట్టాయ్ జిల్లాలో ఈ క్రీడ జరిగింది.
Jallikattu season begins in Tamil Nadu: తమిళనాడులో జల్లికట్టు సీజన్ మొదలైంది. ఎద్దులను ఎదుర్కొనే ఈ సంప్రదాయ క్రీడ ఆ రాష్ట్రంలో నేడు ప్రారంభమైంది. పడుకొట్టాయ్ (Pudukkottai) జిల్లాలోని తుచన్‍కురిచి (Thanchankurichi) గ్రామంలో ఈ ఏడాది జల్లికట్టు సీజన్‍కు నేడు అంకురార్పన జరిగింది. మొదటి రోజునే 350 ఎద్దులు, 250 మంది జల్లికట్టు క్రీడాకారులు బరిలోకి దిగారు. మొత్తంగా తొలిరోజున కనీసం 22 మంది గాయపడ్డారు.
వ్యవసాయ పండుగ సంక్రాంతి (Pangal)కి ముందు నిర్వహించే జల్లికట్టు.. ఈ నెల 6వ తేదీన తమిళనాడులో మొదలుకావాల్సింది. అయితే యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించలేదనే కారణంగా జిల్లా అధికారులు వాయిదా వేశారు. దీంతో నేడు ఈ క్రీడ మొదలైంది. జల్లికట్టు కోసం తమిళనాడు ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఈ క్రీడను చూసేందుకు వచ్చే ప్రజలకు ఎలాంటి హానీ కలగకుండా డబుల్ బ్యారీకేడ్‍లను ఏర్పాటు చేసింది. అంబులెన్స్ లను అందుబాటులో ఉంచింది.
మధురైలో 17న..
Jallikattu in Madurai: మధురై జిల్లాలోని అలంగనల్లూరులో జరిగే జల్లికట్టు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్. అక్కడ జరిగే ఈ క్రీడను చూసేందుకు లక్షలాది మంది తరలివస్తారు. అలంగనల్లూరులో ఈనెల 17వ తేదీన జల్లికట్టు జరగనుంది. మధురైలోని అవనియాపురంలో 15వ తేదీన, పలమేడులో 16వ తేదీన జల్లికట్టు జరగనుంది.
జల్లికట్టులో పాల్గొనే వారికి కొన్ని మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించింది. గ్యాలరీల్లోని సీట్లలో 50 శాతం మంది ప్రేక్షకులనే అనుమతించాలని నిర్ణయించింది. అలాగే ప్రజలకు కొవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ ఉండాలని, వ్యాక్సినేషన్ పూర్తయి ఉండాలని చెప్పింది. అలాగే పోటీలో పాల్గొనే వారు పోటీకి ముందే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, నెగెటివ్ రిపోర్టు సమర్పించాలనే నిబంధన విధించింది.
తమిళనాడులో దశాబ్దాల నుంచి సంప్రదాయ క్రీడ జల్లికట్టు జరుగుతోంది. ఈ క్రీడలో గతంలో చాలా సార్లు అపశ్రుతులు జరిగాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, గాయపడ్డారు. ఈ క్రీడ వల్ల ఎద్దులు కూడా హింసకు గురవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఎద్దును దూకుడుగా మార్చడం కోసం కొందరు వాటి కళ్లలో నిమ్మకాయలను పిండడం, తోకను లాగటం, ఈటెలతో పొడవటం లాంటివి చేస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి.
పండుగ సీజన్‍లో నిర్వహించే ఈ జల్లికట్టులో గెలిచిన వారికి భారీ బహుమతులు దక్కుతుంటాయి. బంగారు కాయిన్లు, బైక్‍లు, కార్లను విజేతలు పొందుతారు. ఎద్దుల విలువ కూడా అమాంతం పెరుగుతుంది. స్థానిక పశువుల జాతులను సంరక్షించేందుకు పురాతన కాలంలో ఈ క్రీడను నిర్వహించడం ప్రారంభించారు. ఇవి క్రమంగా ప్రాచుర్యం పొందాయి. దశాబ్దాలుగా తమిళనాడులో ఈ సంప్రదాయ క్రీడ జల్లికట్టు కొనసాగుతోంది.
2017లో జల్లికట్టును సుప్రీంకోర్టు నిషేధించింది. అయితే అప్పట్లో తమిళనాడులో భారీస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. అయితే, చట్ట సవరణ ద్వారా జల్లికట్టుకు మళ్లీ అనుమతి లభించింది. దీనిపై సుప్రీంలో ఇంకా విచారణ నడుస్తోంది.