Jalgaon accident: రైళ్లో మంటల భయంతో బయటకు దూకి ప్రాణాలు కోల్పోయిన 11 మంది ప్రయాణికులు
Jalgaon accident: రైలు చక్రాల నుంచి పొగలు రావడంతో రైలులో మంటలు చెలరేగుతాయనే భయంతో పుష్పక్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులు హడావుడిగా పట్టాలపైకి దూకడంతో, ఆ ట్రాక్ పై వస్తున్న మరో రైలు ఢీ కొని ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం మహారాష్ట్రలోని జల్గావ్ లో చోటు చేసుకుంది.
Jalgaon accident: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో బుధవారం బెంగళూరు ఎక్స్ ప్రెస్ ఢీకొని 11 మంది మృతి చెందినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం 4.19 గంటలకు పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘోర రైలు ప్రమాదం జరిగింది.

రైలు చక్రాల నుంచి పొగలు రావడంతో..
రైలు చక్రాల నుంచి పొగలు రావడంతో మంటలు చెలరేగుతాయనే భయంతో లక్నో నుంచి ముంబై వెళ్తున్న పుష్పక్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తప్పించుకునే ప్రయత్నంలో హడావుడిగా పట్టాలపైకి దూకడంతో ఈ దుర్ఘటన జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. పక్క ట్రాక్ పై మరో ట్రైన్ వస్తున్న విషయాన్ని గమనించకుండా, ప్రయాణికులు అకస్మాత్తుగా పట్టాలపైకి దూకడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న బెంగళూరు ఎక్స్ ప్రెస్ పట్టాలపైకి దూకిన ప్రయాణికులను వేగంగా ఢీకొట్టింది.
11 మంది మృతి
ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని సెంట్రల్ రైల్వే ముఖ్య అధికార ప్రతినిధి స్వప్నిల్ నీలా తెలిపారు. అయితే, మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నట్లు స్థానిక మీడియా కధనాలు పేర్కొంటున్నాయి. కాగా, పుష్పక్ రైలు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, క్షతగాత్రులకు తగిన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు.