Jagdeep Dhankhar | 14వ ఉప‌రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌-jagdeep dhankhar elected 14th vice president of india ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Jagdeep Dhankhar Elected 14th Vice President Of India

Jagdeep Dhankhar | 14వ ఉప‌రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌

Sudarshan Vaddanam HT Telugu
Aug 06, 2022 08:49 PM IST

Jagdeep Dhankhar | ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో అధికార ఎన్డీయే అభ్య‌ర్థి జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ విజ‌యం సాధించారు. ఆయ‌న‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, విప‌క్ష అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచిన మార్గ‌రెట్ అల్వా, ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌, బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా త‌దిత‌రులు శుభాకాంక్ష‌లు తెలిపారు.

జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్
జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ (Shrikant Singh)

Jagdeep Dhankhar | ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు ముగిశాయి. ప‌శ్చిమబెంగాల్ మాజీ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. అధికార ప‌క్షం ఎన్డీయేకు పార్ల‌మెంట్లో పూర్తి మెజారిటీ ఉండ‌డంతో, ఆ ప‌క్షం బ‌రిలో నిలిపిన జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ సునాయాసంగా విజ‌యం సాధించారు. భార‌త‌దేశ 14వ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఆయ‌న ఆగ‌స్ట్ 11న బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఆగ‌స్ట్ 10న ప్ర‌స్తుత ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Jagdeep Dhankhar | ఇవే వారు సాధించిన ఓట్లు..

అధికార ప‌క్ష అభ్య‌ర్థి జ‌గ్‌దీప్ ధ‌న్‌క‌ర్ ఈ ఎన్నిక‌ల్లో 528 ఓట్లు సాధించి ఘ‌న విజ‌యం అందుకున్నారు. విప‌క్ష అభ్య‌ర్థి మార్గ‌రెట్ అల్వాకు 182 ఓట్లు వ‌చ్చాయి. 15 ఓట్లు చెల్ల‌లేదు. ఓట్ల శాతం ప‌రంగా, మొత్తం చెల్లిన ఓట్ల‌లో జ‌గ‌దీప్‌ధ‌న్‌క‌ర్‌కు 74.36% ఓట్లు వ‌చ్చాయి. విప‌క్షాల్లో కీల‌క‌మైన తృణ‌మూల్ కాంగ్రెస్ ఈ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నారు. ఆ పార్టీకి 39 మంది ఎంపీలున్నారు. మొత్తం 780 మంది ఎంపీల‌కు గానూ ఈ ఎన్నిక‌ల్లో 725 మంది పార్ల‌మెంటు స‌భ్యులు త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకున్నారు.

Jagdeep Dhankhar | ఘ‌న‌మైన విజ‌యం

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఈ స్థాయిలో ఘ‌న విజయం సాధించ‌డం చాలా అరుదు. నిజానికి ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డానికి 356 ఓట్లు వ‌స్తే చాలు. కానీ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ కు 528 ఓట్లు వ‌చ్చాయి. అంటే మొత్తం పోలైన‌, చెల్లిన ఓట్ల‌లో 74.36 శాతం. 1997 త‌రువాత ఇదే గొప్ప విజ‌యం. గ‌త ఆరు ప‌ర్యాయాల్లో ఎవ‌రూ ఇంత మెజారిటీతో విజ‌యం సాధించ‌లేదు.

Jagdeep Dhankhar | ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తు

జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ 1951లో రాజ‌స్తాన్‌లోని కిత‌న అనే చిన్న‌ గ్రామంలో జాట్ వ‌ర్గానికి చెందిన‌ వ్య‌వ‌సాయ కుటుంబంలో జ‌న్మించారు. ఉప‌రాష్ట్ర‌ప‌తి గా పోటీ చేసే ముందు వ‌ర‌కు ప‌శ్చిమ‌బెంగాల్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్నారు. ఈ ఎన్నిక‌ల్లో జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌కు ప‌లు ఎన్డీయేత‌ర పార్టీలు కూడా మ‌ద్ద‌తిచ్చాయి. వాటిలో బిజూ జ‌న‌తాద‌ళ్‌, వైఎస్సార్సీపీ, టీడీపీ, బీఎస్పీ, జేఎంఎం, అకాలీద‌ళ్‌, శివ‌సేన షిండే వ‌ర్గం.. మొద‌లైన‌వి ఉన్నాయి.

WhatsApp channel