IT employee: ఆఫీస్ వాష్ రూమ్ లో గుండెపోటుతో ఐటీ ఉద్యోగి మృతి
IT employee Dies of cardiac arrest: ఆఫీస్ వాష్ రూమ్ లో గుండె పోటుతో ఐటీ ఉద్యోగి మరణించిన ఘటన శుక్రవారం రాత్రి మహారాష్ట్రలోని నాగపూర్ లో జరిగింది. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో నాగపూర్ లోని మిహాన్ ప్రాంతంలోని హెచ్ సీ ఎల్ టెక్ కంపెనీ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్ కు చెందిన కార్యాలయంలో 40 ఏళ్ల ఐటీ ఉద్యోగి గుండెపోటు తో మరణించాడు. సంస్థ కార్యాలయంలోని వాష్ రూమ్ లో గుండెపోటుతో మృతి చెంది, విగత జీవిగా కనిపించాడు. శుక్రవారం ఈ ఘటన జరిగిందని, మృతుడిని హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్ సీనియర్ అనలిస్ట్ నితిన్ ఎడ్విన్ మైఖేల్ గా గుర్తించామని పోలీసులు తెలిపారు.
వాష్ రూమ్ కు వెళ్లి..
శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మిహాన్ ప్రాంతంలోని హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్ కంపెనీ కార్యాలయంలోని వాష్ రూమ్ లోకి వెళ్లిన సీనియర్ అనలిస్ట్ నితిన్ ఎడ్విన్ మైఖేల్ ఆ తరువాత సహోద్యోగులకు అపస్మారక స్థితిలో కనిపించాడని సోనేగావ్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. సహోద్యోగులు వెంటనే నాగ్ పూర్ లోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్ )కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సోనేగావ్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లుగా కేసు నమోదు చేశారు. ప్రాథమిక శవపరీక్ష ఫలితాల్లో ఆ వ్యక్తి గుండెపోటుతో మరణించినట్లు తేలిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అయితే, అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మైఖేల్ కు భార్య, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. తీవ్రమైన పని ఒత్తిడి, వేర్వేరు జాబ్ టైమింగ్స్ కారణంగా ఐటీ ఉద్యోగులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
హెచ్ సీఎల్ ఏం చెప్పిందంటే.
తమ కంపెనీకి చెందిన సీనియర్ ఐటీ ఉద్యోగి మరణించడంపై హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్ కంపెనీ స్పందించింది.‘‘ఇది దురదృష్టకరమైన సంఘటన. విషాదకరమైన నష్టం. మరణించిన ఉద్యోగి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఈ ఘటన జరగగానే క్యాంపస్ హెల్త్ కేర్ క్లినిక్ లో ఉద్యోగికి ఎమర్జెన్సీ సపోర్ట్ అందించి ఆసుపత్రికి తరలించారు. మా ఉద్యోగుల శ్రేయస్సుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. హెచ్ సీ ఎల్ టెక్ తన ఉద్యోగులందరికీ, వారి కుటుంబాలకు ఆన్-క్యాంపస్ క్లినిక్ లు, వార్షిక ప్రివెంటివ్ హెల్త్ చెకప్ లను అందిస్తుంది’’ అని హెచ్ సీ ఎల్ టెక్ ప్రతినిధి తెలిపారు.
గతంలో కూడా..
ఇటీవల లక్నోలోని హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు (HDFC BANK) లో పని ఒత్తిడి కారణంగా ఓ మహిళా ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. సదాఫ్ ఫాతిమా అనే ఉద్యోగి గోమతి నగర్ లోని హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ విబుతి ఖండ్ బ్రాంచ్ లో అడిషనల్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. బ్యాంకు ఆవరణలో కుర్చీ నుంచి జారిపడి ఫాతిమా మృతి చెందినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని సహచరులు తెలిపారు. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ (SP) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగాల నుంచి ప్రైవేటు ఉద్యోగాల వరకు ప్రతిచోటా పని ఒత్తిడి ఒకేలా మారిందని, ప్రజలు బలవంతంతో పనిచేస్తున్నారని అన్నారు.
ఎర్నెస్ట్ అండ్ యంగ్ లో..
మరోవైపు, ఎర్నెస్ట్ అండ్ యంగ్ పుణె క్యాంపస్ లో పనిచేస్తున్న కేరళకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ (CA) అన్నా సెబాస్టియన్ పెరయిల్ జూన్ 20న కంపెనీలో అధిక పనిభారం కారణంగా గుండెపోటుతో మరణించారు. విపరీతమైన పనిభారం కారణంగా ఆందోళన, నిద్రలేమి, ఒత్తిడితో తన కుమార్తె పడుతున్న కష్టాలను అన్నా తల్లి ఒక బహిరంగ లేఖలో వివరించారు. ఆమె మేనేజర్ ఉద్యోగి శ్రేయస్సు కంటే పనికి ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలను ఉదహరించారు.