ISRO: విజయవంతంగా నింగిలోకి ఈఓఎస్-08 ఉపగ్రహం; ‘ఎస్ఎస్ఎల్వీ’ పూర్తిగా సిద్ధమన్న ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో చరిత్రాత్మక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. శ్రీహరికోట లోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) ద్వారా ఈఓఎస్-08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
SSLV Ready: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శుక్రవారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) మూడో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో ఎస్ ఎస్ ఎల్ వీ అభివృద్ధి పూర్తయిందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ప్రకటించారు.
ఎస్ఎస్ఎల్వీ అభివృద్ధి పూర్తి: ఇస్రో చీఫ్ సోమనాథ్
స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV)-డీ3/ఈఓఎస్-08 మూడో ప్రయోగం విజయవంతంగా పూర్తయిందని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. ఇంజెక్షన్ పరిస్థితుల్లో ఎలాంటి తేడాలు లేకుండా అనుకున్నట్లుగానే రాకెట్ స్పేస్ క్రాఫ్ట్ ను కచ్చితమైన కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. ట్రాకింగ్ తర్వాత తుది కక్ష్య తెలుస్తుందని, అయితే ప్రస్తుతానికి అంతా, ప్రణాళిక ప్రకారం, పక్కాగా ఉందని సోమనాథ్ చెప్పారు. ఈఓఎస్-08 ఉపగ్రహంతో పాటు ఎస్ఆర్-08 ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించారు. ఎస్ఎస్ఎల్వీ-డీ3 బృందానికి, ప్రాజెక్టు బృందానికి సోమనాథ్ అభినందనలు తెలిపారు.
ఎస్ఎస్ఎల్వీ రెడీ
ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో స్మాల్ లిఫ్ట్ లాంచ్ వెహికల్ అభివృద్ధి పూర్తయింది. ఈ రాకెట్ 500 కిలోల బరువున్న ఉపగ్రహాలను మోసుకెళ్లి ‘లో ఎర్త్ ఆర్బిట్’ (భూమికి 500 కిలోమీటర్ల ఎత్తు వరకు) చేర్చగలదు. ఎస్ఎస్ఎల్వీ మూడో అభివృద్ధి ప్రయోగంతో ఎస్ఎస్ఎల్వీ అభివృద్ధి ప్రక్రియ పూర్తయినట్లయిందని ఇస్రో చీఫ్ తెలిపారు. ప్రభుత్వ యాజమాన్యంలోని న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ మద్దతుతో ఇప్పుడు భారతీయ పరిశ్రమలు ఈ రాకెట్ ను భవిష్యత్తు మిషన్ల కోసం ఉపయోగించవచ్చు.
ఇస్రోపై కేంద్రం ప్రశంసలు
ఎస్ ఎస్ ఎల్ వీ-డీ3/ఈఓఎస్-08 మిషన్ ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో బృందాన్ని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రశంసించారు. ఎస్ఎస్ఎల్వీ-డీ3/ఈఓఎస్-08 మిషన్ ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తి, ప్రోత్సాహంతో ఇస్రో బృందం ఒకదాని తర్వాత మరొకటి వరుస విజయాలను కొనసాగిస్తోందన్నారు.
ఇస్రో తదుపరి మిషన్లు ఏమిటి?
శుక్రవారం ప్రయోగం విజయవంతం కావడంతో ఈ ఏడాది వరుస విజయవంతమైన మిషన్లలో ఇస్రో (isro) హ్యాట్రిక్ సాధించింది. పీఎస్ఎల్వీ-సీ58/ఎక్స్పోశాట్ మిషన్ ను జనవరిలో, జీఎస్ఎల్వీ-ఎఫ్14/ఇన్శాట్-3డీఎస్ మిషన్ ను ఫిబ్రవరిలో ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. రాబోయే ఇస్రో మిషన్లలో నాసా-ఇస్రో ఎస్ఎఆర్ (NISAR), నాసా సహకారంతో అభివృద్ధి చేసిన ‘లో ఎర్త్ ఆర్బిట్ (LEO)’ అబ్జర్వేటరీ ఉన్నాయి. మరో ప్రధాన మిషన్ గగన్ యాన్. దీని ద్వారా ముగ్గురు ఆస్ట్రోనాట్స్ ను 400 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యకు పంపించి, మూడు రోజుల తరువాత వారిని సురక్షితంగా భూమికి తిరిగి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్ ల ప్రయోగ తేదీలను ఇంకా ప్రకటించలేదు.
ఐఎస్ఎస్ కు ఇండియన్
వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా ఆక్సియోమ్ -4 మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లే చారిత్రాత్మక ప్రయాణంపై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. అతను మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి ఐఎస్ఎస్ కు వెళ్లనున్నారు. ఈ మిషన్ పూర్తయిన తరువాత ఈ ప్రయాణం చేసిన మొదటి భారతీయ వ్యోమగామిగా వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా నిలుస్తారు.