ISRO : 2025లో 6 భారీ మిషన్‌లకు ఇస్రో సిద్ధం.. ఇందులో అమెరికా ఉపగ్రహం కూడా!
ISRO 2025 : కొత్త ఏడాది 2025లో ఇస్రో భారీ ప్రయోగాలకు సిద్ధమవుతోంది. 6 భారీ మిషన్‌లు చేసేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇందులో అమెరికా ఉపగ్రహం కూడా ఉంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు 2025 సంవత్సరం చాలా ప్రణాళికలతో ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో ఇస్రో తన మిషన్‌ల గురించి ప్రకటించింది. గగన్ యాన్ మిషన్ కింద ఉమెన్ రోబో వ్యోమిత్రను అంతరిక్షంలోకి పంపనుంది. దీనితోపాటుగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇండో-యూఎస్ జాయింట్ శాటిలైట్ నిసార్‌తో సహా 2025 మొదటి ఆరు నెలల్లో ఇస్రో అరడజను భారీ మిషన్లను ప్రయోగిస్తుంది.
అధునాతన నావిగేషన్ ఉపగ్రహం ఎన్వీఎస్-02ను ఇస్రో జనవరిలో ప్రయోగించనుందని కేంద్రమంత్రి మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. జీఎస్ఎల్వీ (జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్) ద్వారా దీన్ని ప్రయోగించనున్నారు. ఇస్రోకు ఇది 100వ మిషన్.
ఆ తర్వాత తొలి మానవ రహిత గగన్ యాన్ మిషన్ కింద ఇస్రో 'వ్యోమిత్ర'ను అంతరిక్షంలోకి పంపనుంది. ఈ మిషన్ కోసం ఇస్రో ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఉమెన్ రోబో ఇది. గగన్ యాన్ మానవ సహిత మిషన్‌కు ముందుగా జరగనుంది. ఇది సరిగ్గా మానవ సహిత మిషన్ లాగే ఉంటుంది. కానీ ఇందులో మనుషులు ఉండరు. వ్యోమిత్ర మిషన్ విజయవంతమైతే మానవ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతారు.
భారత్, అమెరికా సంయుక్త ప్రయత్నంలో అభివృద్ధి చేసిన నిసార్ (నాసా-ఇస్రో ఎస్ఏఆర్) ఉపగ్రహాన్ని కూడా మార్చిలో ప్రయోగించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉపగ్రహం అయిన ఈ ఉపగ్రహం కోసం 12,505 కోట్లు చేస్తున్నారు. ఈ ఉపగ్రహం ప్రతి 12 రోజులకు ఒకసారి భూమిని స్కాన్ చేస్తుందని, ఇది చాలా ఎక్కువ రిజల్యూషన్ కలిగి ఉంటుందని తెలుస్తోంది.
చంద్రుడిపైకి మనిషిని పంపే పనిలో అమెరికా బిజీగా ఉన్న సమయంలో 1969లో ఇస్రో ఆవిర్భవించిందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారి ఇస్రో అమెరికా ఉపగ్రహాలను ప్రయోగిస్తోంది. గత దశాబ్ద కాలంలో అమెరికా, యూరోపియన్ యూనియన్ నుంచి ఇస్రో 400 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
2025 ఉత్తేజకరమైన సంవత్సరం అని, ఈ సంవత్సరం ఇస్రో నాలుగు జీఎస్ఎల్వి రాకెట్లు, మూడు పీఎస్ఎల్వీలు, ఒక ఎస్ఎస్ఎల్వీని ప్రయోగించనుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. 2024లో భారత్ 15 మిషన్లను ప్రయోగించింది. ఇందులో భారీ మిషన్‌లు కూడా ఉన్నాయి. 2025 ఇస్రోకు మైలురాయిగా నిలుస్తుందని సోమనాథ్ తెలిపారు. ఈ ఏడాది భారత అంతరిక్ష కార్యక్రమం పురోగతిలో కొత్త అధ్యాయాన్ని లిఖించడమే కాకుండా, భారత అంతరిక్ష శక్తిని ప్రపంచ వేదికపై మరింత బలంగా ప్రదర్శించనున్నారు.