హమాస్‌కు ఇజ్రాయెల్ ప్రధాని వార్నింగ్.. ఆ టైమ్‌కు బందీలను విడుదల చేయకపోతే మళ్లీ యుద్ధమే!
Israel Hamas War : హమాస్‌కు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. తమ బందీలను విడుదల చేయకపోతే తిరిగి పోరాటం ప్రారంభిస్తామని చెప్పారు.

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేయకపోతే గాజా స్ట్రిప్‌లో సైనిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తామని బెదిరించారు. ఈ శనివారం మధ్యాహ్నంలోపు విడుదల చేయాలని అల్టిమేటం జారీ చేశారు. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రెండు వైపులా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. బందీలను విడుదల చేయకుంటే దీనికి ముగింపు పలుకుతామని నెతన్యాహు తాజాగా స్పష్టం చేశారు.
హమాస్ ప్రకటన
ఒప్పందంలో భాగంగా హమాస్ 21 మంది ఇజ్రాయెల్ వాసులను విడుదల చేసింది. ఫిబ్రవరి 15న మరింత మందిని విడుదల చేయాలని హమాస్ నిర్ణయించింది. కానీ గాజాకు సహాయ సరఫరాలను ఇజ్రాయెల్ అడ్డుకుంటుందని ఆరోపిస్తూ, శనివారం జరగాల్సిన మరో ముగ్గురు బందీల విడుదలను వాయిదా వేస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. ఈ ప్రకటన ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితిని మరింత దిగజార్చింది.
ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, ఈ కారణంగా బందీల విడుదల ఆపేస్తామని హమాస్ స్పష్టం చేసింది. అంతేకాకుండా పాలస్తీనా ప్రజలను గాజాలోకి రాకుండా ఆలస్యం చేస్తోందని పేర్కొంది. మనవతా సాయాన్ని నిలిపేస్తుందని వెల్లడించింది.
ట్రంప్ జోక్యం
అయితే మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిస్థితిని సమీక్షించారు. కాల్పుల విరమణ ఒప్పందంలో పేర్కొన్న దశలవారీ విడుదలలకు కట్టుబడి ఉండటానికి బదులుగా బందీలందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేయాలని ఇజ్రాయెల్‌ను ప్రోత్సహించారు. శనివారం నాటికి పూర్తి బందీలను విడుదల చేయాలనే డిమాండ్‌ను హమాస్ పాటించకపోతే ఇజ్రాయెల్ కాల్పుల విరమణను పూర్తిగా విరమించుకోవాలని ట్రంప్ సూచించారు. ఈ జోక్యంతో విషయం మరింత సీరియస్ అయింది.
నెతన్యాహహు ఆదేశాలు
తన మంత్రివర్గంతో నాలుగు గంటల పాటు జరిగిన సమావేశం తర్వాత, గాజా స్ట్రిప్ చుట్టూ దళాలను బలోపేతం చేయాలని నెతన్యాహు ఇజ్రాయెల్ రక్షణ దళాలను(IDF) ఆదేశించారు. హమాస్ బందీలను విడుదల చేయకపోతే అన్ని పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని కూడా చెప్పారు.
హమాస్ ఆరోపణ
కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ తన దగ్గర ఉన్న బందీలను విడుదల చేస్తోంది. మరోవైపు పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ విడుదల చేస్తుంది. కాల్పుల విరమణ నిబంధనలలో నిర్దేశించినట్లుగా, గాజాకు సహాయం అందించడంలో ఇజ్రాయెల్ తన హామీలను నెరవేర్చలేదని హమాస్ ఆరోపిస్తోంది. బందీల విడుదలను ఆపేయాలని హమాస్ నిర్ణయం తీసుకుంది.